- లేకుంటే అసెంబ్లీని స్తంభింపజేస్తాం: హరీశ్‌రావు
హైదరాబాద్: తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థ అంటూ గొప్పలు చెప్పుకునే సీఎం రేవంత్‌రెడ్డి.. నెలలు గడుస్తున్నా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.
గత రెండున్నరేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో రాష్ట్రంలోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని హరీశ్‌రావు తెలిపారు. అధ్యాపకులు, నాన్‌టీచింగ్ సిబ్బందికి నెలల తరబడి జీతాలు అందడం లేదని, కొన్ని కళాశాలల్లో 5 నుంచి 10 నెలల వరకు వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. అద్దెలు, విద్యుత్ బిల్లులు, యూనివర్సిటీ ఫీజులు, ఇతర నిర్వహణ ఖర్చులు చెల్లించలేక కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు.
రాష్ట్రంలో ఒకప్పుడు సుమారు 960గా ఉన్న ప్రైవేట్ డిగ్రీ కళాశాలల సంఖ్య ఇప్పుడు దాదాపు 650కి తగ్గిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇప్పటికే సుమారు 310 కళాశాలలు తగ్గిపోయాయని, ఇదే పరిస్థితి కొనసాగితే మరిన్ని కళాశాలలు మూతపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీని ప్రభావం ప్రధానంగా గ్రామీణ తెలంగాణపై పడుతుందని తెలిపారు.
చిన్న పట్టణాలు, మండలాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ కళాశాలలు పరిమితంగా ఉన్నందున పేద, మధ్యతరగతి విద్యార్థులకు ప్రైవేట్ కళాశాలలే ఉన్నత విద్యకు ప్రధాన ఆధారంగా ఉన్నాయని హరీశ్‌రావు అన్నారు. ఒక కళాశాల మూతపడటం వల్ల ఆ ప్రాంతంలోని వందలాది, వేలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్య దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద, బలహీన వర్గాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉన్నత విద్యకు భరోసాగా నిలుస్తోందన్నారు.
తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు తమ సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చి వినతిపత్రం అందించారని హరీశ్‌రావు తెలిపారు. ప్రభుత్వం చెల్లించాల్సిన నిధులను ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచడం వల్ల ఆ భారం కళాశాలలు, అధ్యాపకులు, సిబ్బంది, చివరకు విద్యార్థులపై పడుతోందని అన్నారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో రూ.2,500 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నప్పటికీ వాటిని చెల్లించి పథకాన్ని కొనసాగించామని హరీశ్‌రావు గుర్తుచేశారు. పెద్ద నోట్ల రద్దు, కరోనా వంటి సంక్షోభాలు వచ్చినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నిలిపివేయలేదన్నారు. తొమ్మిదిన్నరేళ్లలో గత కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన బకాయిలతో కలిపి రూ.19,500 కోట్లను ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద చెల్లించామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు పాత బకాయిలను పూర్తిగా చెల్లిస్తామని హామీ ఇచ్చిందని హరీశ్‌రావు అన్నారు. మూడు బడ్జెట్లు పూర్తయినా దాదాపు రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించారు.
వైఎస్‌ఆర్ ప్రారంభించిన పథకం అంటూ గొప్పలు చెప్పుకోవడం కాకుండా దాన్ని సక్రమంగా అమలు చేసే బాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఇది కేవలం ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల సమస్య కాదని, విద్యార్థుల భవిష్యత్తు, అధ్యాపకులు, సిబ్బంది జీవనోపాధికి సంబంధించిన అంశమని అన్నారు.
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే పూర్తిగా విడుదల చేయాలని, భవిష్యత్తులో బకాయిలు పేరుకుపోకుండా ప్రతి విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నిర్ణీత గడువులో విడుదల చేసే శాశ్వత విధానాన్ని అమలు చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. బకాయిలను విడుదల చేయకపోతే ఈ అంశంపై అసెంబ్లీని స్తంభింపజేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
No comments:
Post a Comment