Tuesday, 1 September 2026

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సీ గుడ్‌బై.. భావోద్వేగానికి గురైన కరీనా కపూర్





ముంబై: ఫుట్‌బాల్ ప్రపంచంలో ఒక శకం ముగిసింది. అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ సోషల్ మీడియా వేదికగా అత్యంత భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. సుదీర్ఘమైన 21 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలుకుతూ ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది ఫుట్‌బాల్ అభిమానులతో పాటు సినీ ప్రముఖులను సైతం తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది.మెస్సీ పంచుకున్న భావోద్వేగ రిటైర్మెంట్ వీడియో, సందేశంపై బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ స్పందించారు. ఆయన పోస్ట్ కామెంట్స్ సెక్షన్‌లో వరుసగా రెడ్ హార్ట్ ఎమోజీలను జత చేస్తూ తన అభిమానాన్ని చాటుకున్నారు. గతేడాది డిసెంబర్‌లో మెస్సీ భారతదేశంలో మూడు రోజుల ప్రచార పర్యటనకు వచ్చిన సమయంలో కరీనా తన కుమారులు తైమూర్, జెహ్‌లతో కలిసి ఆయనను ప్రత్యేకంగా కలిసిన విషయం తెలిసిందే.  మరోవైపు మలయాళ నటుడు ఇంద్రజిత్ సుకుమారన్ కూడా మెస్సీ వీడియోను షేర్ చేస్తూ, 'థాంక్యూ' అని రాసుకొచ్చారు.


తన రిటైర్మెంట్ ప్రకటనలో మెస్సీ మనసు విప్పి మాట్లాడారు. "ఫైనల్ ముగిసిన తర్వాత చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. జాతీయ జట్టుకు వీడ్కోలు పలుకుతున్నానని అందరికీ చెబుతున్నాను. ఇది నా మనసును ఎంతగానో కలచివేస్తున్న నిర్ణయం అయినప్పటికీ, తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నాను" అని తెలిపారు. అంతేకాకుండా, ఇటీవల తన తండ్రి కన్నుమూయడం కూడా ఈ నిర్ణయంపై మరింత బలంగా నిలబడేలా చేసిందని, కొత్త తరం ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అర్జెంటీనా జెర్సీ కోసం ప్రతి మ్యాచ్‌లోనూ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చానని, అభిమానులను గర్వపడేలా చేయడానికి ఎల్లప్పుడూ పోరాడానని మెస్సీ గుర్తుచేసుకున్నారు. 


2005లో టీనేజర్‌గా ప్రయాణం ప్రారంభించిన మెస్సీ, అర్జెంటీనా ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఆటగాడిగా నిలిచారు. తన కెరీర్‌లో 6 ఫిఫా ప్రపంచకప్‌లలో (2006-2026) ప్రాతినిధ్యం వహించి, మొత్తంగా 21 ప్రపంచకప్ గోల్స్ సాధించారు. 2021 కోపా అమెరికా, 2022 కతార్ ఫిఫా వరల్డ్ కప్, 2024 కోపా అమెరికా టోర్నీలలో అర్జెంటీనాకు చారిత్రక విజయాలు అందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. జాతీయ జట్టు తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడటమే కాకుండా, అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా అపారమైన వారసత్వాన్ని వదిలివెళ్తున్నారు.

No comments:

Post a Comment

Featured post

డేటా సెంటర్ల హబ్‌గా భారత్

200 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధ్యం – పీయూష్ గోయల్  7.8 శాతం వృద్ధి సాధించడంపై ప్రధాని మోడీ నాయకత్వానికి, ప్రజలకు అభినందనలు న్యూఢిల్లీ: డే...