- నాలుగు దశాబ్దాల కాంగ్రెస్ ప్రస్థానంలో చేదు అనుభవం
మహబూబ్‌నగర్: కాంగ్రెస్ పార్టీతో నాలుగు దశాబ్దాలకు పైగా అనుబంధం.. పార్టీ బలోపేతానికి నిరంతర కృషి.. రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు.. అధిష్ఠానం ఆదేశాలను పాటించిన సీనియర్ నేత.. ఇంత సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం సాగించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి అనూహ్య పరిణామం ఎదురైంది. పార్టీ నేతలు, స్థానిక ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ జీవితంలో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. అధిష్ఠానం నిర్ణయంతో పదవిని కోల్పోవాల్సి వచ్చింది.
- ఎమ్మెల్యేపై వ్యాఖ్యలతో వివాదం
గోపాల్‌పేట మండలంలో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఎమ్మెల్యే బి.ఫారాలను పార్టీ, నాయకులు డబ్బులకు అమ్ముకుంటున్నారంటూ ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి.. చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు.
ఈ వ్యవహారంపై టీపీసీసీతో పాటు దిల్లీ వెళ్లి అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అనంతరం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఈ అంశంపై విచారణ జరిపి నివేదికను అధిష్ఠానానికి సమర్పించింది. ముఖ్యమంత్రి సైతం ఏఐసీసీ నేతలతో ఈ అంశంపై చర్చించినట్లు తెలిసింది. చివరకు చిన్నారెడ్డి, మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని అధిష్ఠానం నిర్ణయించింది.
- షోకాజ్ నోటీసుకు లేఖతో వివరణ
తన వ్యాఖ్యలపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేయడంతో చిన్నారెడ్డి లేఖ ద్వారా వివరణ ఇచ్చారు. 1978లో కాంగ్రెస్‌లో చేరిన తాను ఏనాడూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని అందులో పేర్కొన్నారు.
గోపాల్‌పేటలో కార్యకర్తలు, నాయకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఎమ్మెల్యే వ్యవహారశైలిపై వారి మనోభావాలు, ఆవేదనను మాత్రమే తాను ఆ రోజు వ్యక్తం చేశానని వివరించారు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగించి, తనకు జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని కోరారు. అయితే అధిష్ఠానం మాత్రం ఆయన వివరణతో సంతృప్తి చెందకపోవడంతో చర్యలకు సిద్ధమైంది.
- సొంతూరులోనే మౌనం
వనపర్తి కాంగ్రెస్‌లో నెలకొన్న వివాదం దాదాపు 15 రోజులుగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గురువారం అధిష్ఠానం తన నిర్ణయాన్ని ప్రకటించడంతో చిన్నారెడ్డితో పాటు ఆయన అనుచరుల్లోనూ నిరాశ నెలకొన్నట్లు తెలుస్తోంది.అధిష్ఠానం నిర్ణయం వెలువడిన అనంతరం చిన్నారెడ్డి తన సొంతూరు గోపాల్‌పేట మండలం జయన్న తిరుమలాపూర్‌కు వెళ్లారు. అక్కడ పొలం గట్ల మధ్య కొంతసేపు గడుపుతూ కనిపించారు. పార్టీ నిర్ణయంపై ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
- తదుపరి అడుగు ఏమిటి?
దాదాపు 48 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నేతపై అధిష్ఠానం ఇంతటి నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు చిన్నారెడ్డి తదుపరి అడుగుపై ఆసక్తి నెలకొంది. తన క్యాడర్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆయన ఇప్పటికే ప్రకటించారు. పదవులపై తనకు ఎలాంటి వ్యామోహం లేదని కూడా స్పష్టం చేశారు.అయితే తన సీనియారిటీకి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదన్న అసంతృప్తితో ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాల్లో చర్చ జరుగుతోంది. వివరణ ఇచ్చినప్పటికీ పదవి నుంచి తొలగించడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.కార్యకర్తలు, అనుచరులతో చర్చించిన అనంతరం చిన్నారెడ్డి తన తదుపరి రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంత సుదీర్ఘ కాంగ్రెస్ ప్రస్థానం సాగించిన చిన్నారెడ్డి.. తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
No comments:
Post a Comment