Sunday, 26 July 2026

అఖిలేశ్‌ కు అసదుద్దీన్ పొత్తు ఆఫర్


  • 'ఫ్రెండ్ రిక్వెస్ట్' అంటూ బీజేపీ సెటైర్లు


ఉత్తరప్రదేశ్ రాబోయే 2027 శాసనసభ ఎన్నికల నేపథ్యంతో ఆ రాష్ట్ర రాజకీయం అప్పుడే వేడెక్కింది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తో పొత్తుకు సిద్ధంగా ఉన్నానని ఏఐఎంఐఎం (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన ప్రకటన చేశారు. సమయం మించిపోకముందే చర్చలు ప్రారంభించాలని ఆయన అఖిలేశ్‌కు స్పష్టమైన సందేశాన్ని పంపారు.



మొరాదాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఒవైసీ మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం తమకు ఇష్టం లేదని, అందుకోసం చెయ్యి కలపడానికి, పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక ఏడవటం కంటే, ఇప్పుడే కూర్చొని చర్చలు జరపడం మంచిదని ఆయన వ్యాఖ్యానించారు. తాము పోటీ చేయడం వల్ల ప్రతిపక్షాల ఓట్లు చీలిపోయి నష్టం జరుగుతోందని భావిస్తే, కలిసి పోరాడేందుకు తాము సుముఖంగా ఉన్నామన్నారు. తమ పోరాటం ఏ మతానికి వ్యతిరేకం కాదని, ఆత్మగౌరవం, న్యాయం , సమానత్వం కోసమేనని ఉద్ఘాటించారు. అధికారంలో సమాన హోదా, హక్కుల గురించి మాట్లాడేందుకే తాము ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ ఎంపీ స్పష్టం చేశారు.


ఒవైసీ ఆఫర్‌పై బీజేపీ స్పందిస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా దీనిపై స్పందిస్తూ, ఇది కేవలం 'ఓటు బ్యాంక్ రాజకీయం' కోసం జరుగుతున్న సహకారమని మండిపడ్డారు. అఖిలేశ్‌ యాదవ్, ఒవైసీలు ఇద్దరూ సంతుష్టీకరణ రాజకీయాల్లో పోటీ పడుతున్నారని, ఎవరు 'పెద్ద భాయ్‌జాన్' అవుతారనే పోటీని పక్కన పెట్టి ఇప్పుడు 'భాయ్‌జాన్ కొలాబరేషన్' చేయడానికి సిద్ధపడ్డారని ఎద్దేవా చేశారు. అందుకే ఒవైసీ, అఖిలేశ్‌కు ఒక 'ఫ్రెండ్ రిక్వెస్ట్' పంపారని, వీరిద్దరూ ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలని పూనావాలా అభివర్ణించారు. యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీఏపీ ప్రభుత్వాన్ని ఢీకొట్టడానికి ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్న వేళ, ఒవైసీ ఇచ్చిన ఈ పొత్తు ఆఫర్ ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది.

No comments:

Post a Comment

Featured post

కొత్త కామన్వెల్త్ రికార్డుతో చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను

గ్లాస్గో వేదికగా జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో భారత ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను సరికొత్త చరిత్ర సృష్టించారు. మహిళల 48 కేజీల ఫైన...