- సంగీత ప్రయాణంలో మరో మైలురాయి
సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్‌లో ప్రసారమైన ప్రముఖ సంగీత రియాలిటీ షో 'ఇండియన్ ఐడల్ సీజన్ 16' గ్రాండ్ ఫినాలే ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా ముగిసింది. దేశవ్యాప్తంగా సంగీతాభిమానులను అలరించిన ఈ షోలో ఒడిశాకు చెందిన ప్రతిభావంతమైన గాయని జ్యోతిర్మయి నాయక్ విజేతగా నిలిచి 'ఇండియన్ ఐడల్ 16' ట్రోఫీని కైవసం చేసుకుంది. తుది పోరులో గట్టి పోటీనిచ్చిన అన్షికా చోంకర్, మనరాజ్ వీర్ సింగ్, మిస్మీ బోసు, సుహైల్ సూఫీ , తనిష్క్ శుక్లా వంటి ప్రతిభావంతులైన ఫైనలిస్టులను వెనక్కి నెట్టి జ్యోతిర్మయి ఈ ఘనత సాధించింది. ఫినాలేలో ఆమె ఆలపించిన "సైయా ఓ సైయా" పాట విరివిగా ఆకట్టుకుని విజయంలో కీలక పాత్ర పోషించింది.
ఇండియన్ ఐడల్ వేదికపైకి రాకముందే ఒడిశా సంగీత పరిశ్రమలో గుర్తింపు పొందిన జ్యోతిర్మయి, మ్యూజిక్ థెరపీ ద్వారా క్యాన్సర్ బాధితులకు ఉపశమనం కలిగించే గొప్ప సామాజిక సేవలో కూడా పాలుపంచుకుంది. తన గెలుపుపై స్పందిస్తూ.. ఆడిషన్స్ నుంచి విజేతగా నిలిచే వరకు సాగిన ఈ ప్రయాణం ఒక కలలా ఉందని, ఇది తన జీవితాన్నే మార్చేసిందని భావోద్వేగానికి గురైంది. ప్రతి ప్రదర్శన తనను మరింత మెరుగైన గాయనిగా, వ్యక్తిగా తీర్చిదిద్దిందని తెలుపుతూ.. తన విజయం వెనుక ఉన్న కుటుంబ సభ్యులకు, జడ్జీలకు, ఓటు వేసి గెలిపించిన అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది.
షో అంతటా జ్యోతిర్మయి అందించిన అద్భుతమైన ప్రదర్శనలు న్యాయనిర్ణేతలను, ప్రముఖులను విశేషంగా ఆకట్టుకున్నాయి. "ఓ జబ్ తక్ హై జాన్" పాటకు సదాబహార్ నటి హేమా మాలిని నుంచి స్టాండింగ్ ఓవేషన్ లభించగా, "జానే క్యూ లోగ్ మొహబ్బత్ కియా కర్తే హై" పాటతో నటి లీనా చందావర్కర్‌ను మెప్పించింది. ఇక మెగా ఫినాలే వేదిక ప్రముఖ గాయకులు శ్రేయా ఘోషాల్, బాద్‌షా, ఉషా ఉతుప్, ఉదిత్ నారాయణ్, పాపోన్, కుమార్ సానులతో పాటు సినీ తారలు షెహనాజ్ గిల్, ఊర్మిళా మాతోండ్కర్‌ల సమక్షంలో మరింత కోలాహలంగా మారింది. ఇండియన్ ఐడల్ 16 టైటిల్ గెలుచుకున్న జ్యోతిర్మయికి సోషల్ మీడియా వ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
No comments:
Post a Comment