Wednesday, 1 July 2026

బాలీవుడ్ సంగీత సామ్రాజ్యంలో నిశ్శబ్దం


  • గాయకుల గొంతు నొక్కుతున్న అనారోగ్యం, ఒత్తిడి.. 
  • అరిజిత్ సింగ్, ప్రీతమ్‌ ల సంచలన నిర్ణయం వెనుక అసలు రహస్యాలివే
  • పద్మభూషణ్ వేదికపై ఆల్కా యాగ్నిక్ దీనస్థితి చూసి కన్నీరు పెడుతున్న అభిమానులు
  • సోనూ నిగమ్ మెడ నరాల సమస్య.. 
  • తీవ్ర శ్రవణ లోపానికి కారణమవుతున్న హెడ్‌ఫోన్స్ వాడకం



భారతీయ చిత్ర పరిశ్రమకు గుండెకాయ లాంటి బాలీవుడ్ సంగీత ప్రపంచం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. మనల్ని దశాబ్దాలుగా తమ మధుర స్వరాలతో ఓలలాడించిన దిగ్గజ గాయకులు, సంగీత దర్శకులు ఒకరి తర్వాత ఒకరు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడటం.. మరికొందరు కెరీర్ పీక్ స్టేజ్‌ లో ఉండగానే సంచలన విరమణ ప్రకటనలు చేయడం ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. ఇటీవల ప్రముఖ సీనియర్ సింగర్ ఆల్కా యాగ్నిక్ పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకోవడానికి చాలా కాలం తర్వాత బహిరంగంగా ప్రజల ముందుకు వచ్చారు. ‘సడన్ సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్’ (SSNHL) అనే అరుదైన వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె తన వినికిడి శక్తిని పూర్తిగా కోల్పోయి, అత్యంత బలహీనంగా కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఆల్కా యాగ్నిక్ మాత్రమే కాకుండా, స్టార్ సింగర్ సోనూ నిగమ్ సైతం తాను ‘కంప్రెస్డ్ నెక్’ (మెడ నరాలు నొక్కేయడం) సమస్యతో బాధపడుతున్నానని, గొంతుపై దీని ప్రభావం పడకుండా ఉండేందుకు నిరంతరం పెయిన్ కిల్లర్స్ వాడుతున్నానని వెల్లడించారు. అలాగే సౌత్ ఇండియా ప్రముఖ గాయని సుజాతా మోహన్ కూడా గొంతు సమస్యల కారణంగా తన కెరీర్‌ కు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది.


ఈ శారీరక ఇబ్బందులు ఒకవైపైతే.. ప్రస్తుత జనరేషన్ యూత్ ఐకాన్, మెలోడీ కింగ్ అరిజిత్ సింగ్ ఇకపై సినిమాలకు ప్లేబ్యాక్ సింగర్‌ గా పాడబోనని, కమర్షియల్ కెరీర్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించి దేశాన్ని షాక్‌ కు గురిచేశారు. ఆయనతో పాటు ఎన్నో చార్ట్‌బస్టర్ సాంగ్స్ ఇచ్చిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ కూడా తన 55వ పుట్టినరోజు సందర్భంగా సరికొత్త ప్రయోగాల కోసం సినిమా సంగీతానికి కొంతకాలం విరామం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామాలపై ప్రముఖ గాయని మహాలక్ష్మి అయ్యర్, ప్రఖ్యాత డ్రమ్మర్ గినో బ్యాంక్స్ , సౌండ్ డిజైనర్ బిశ్వదీప్ ఛటర్జీలు ఎన్డీటీవీ (NDTV) తో ప్రత్యేకంగా మాట్లాడారు. నిరంతరం హిట్స్ ఇవ్వాలంటూ ప్రొడక్షన్ హౌస్‌లు, నిర్మాతలు పెట్టే విపరీతమైన ఒత్తిడి  వల్లే అరిజిత్ సింగ్ వంటి టాప్ సింగర్స్ సృజనాత్మక అలసటకు గురై పక్కకు తప్పుకుంటున్నారని మహాలక్ష్మి అయ్యర్ విశ్లేషించారు. అలాగే ఆల్కా యాగ్నిక్ ఎదుర్కొంటున్న వినికిడి సమస్య ప్రతి సింగర్‌ ను భయపెట్టే విషయమేనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.



అతిగా హెడ్‌ఫోన్స్ వాడటం, విపరీతమైన సౌండ్స్ మధ్య లైవ్ కాన్సర్ట్‌ లు చేయడం వల్ల వినికిడి లోపం వస్తుందంటూ ఆల్కా యాగ్నిక్ చేసిన హెచ్చరికలపై సౌండ్ ఇంజనీర్ బిశ్వదీప్ ఛటర్జీ స్పందిస్తూ.. స్టూడియోలలో ప్రమాణాల కంటే ఎక్కువ శబ్దంతో (85 డెసిబెల్స్ దాటి) నిరంతరం రికార్డింగులు చేయడం కచ్చితంగా ప్రమాదకరమేనని అంగీకరించారు. భారతీయులు సహజంగానే ఎక్కువ బేస్, లౌడ్ మ్యూజిక్ ఇష్టపడతారని, అయితే చెవులను కాపాడుకోవడానికి హెడ్‌ఫోన్స్ వాడకాన్ని తగ్గించి క్రమం తప్పకుండా ఈఎన్‌టీ (ENT) పరీక్షలు చేయించుకోవడం ఉత్తమమని సూచించారు. డ్రమ్మర్ గినో బ్యాంక్స్ మాట్లాడుతూ.. విదేశాలతో పోలిస్తే మన దేశంలో లైవ్ షోలలో సౌండ్స్ చాలా ఎక్కువగా పెడుతుంటారని, గాయకులు తమ ఇన్-ఇయర్ మానిటర్ల వాల్యూమ్‌ ను కంట్రోల్ లో ఉంచుకోకపోతే దీర్ఘకాలంలో శాశ్వత వినికిడి లోపం తప్పదని హెచ్చరించారు. గాయకులకు రోజూవారీ ‘సాధన, ప్రాణాయామం ,యోగా ఎంత ముఖ్యమో.. ఎప్పుడు ఎక్కడ విరామం తీసుకోవాలో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యమని ఈ నిపుణులు స్పష్టం చేశారు.

No comments:

Post a Comment

Featured post

ఫిఫా జోష్‌లో ఉన్నారా? తప్పక చూడాల్సిన ఐదు సినిమాలు ఇవే

 ప్రస్తుతం ఫిఫా ప్రపంచకప్ 2026 (FIFA World Cup 2026) హడావుడితో ఫుట్‌బాల్ జ్వరం ప్రపంచవ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఉంది. మైదానంలో జరుగుతున్న ఉత్క...