- నైపుణ్యాలు నేర్చుకుంటూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచన
- ప్రజల్లో ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకం పెంచేలా పనిచేయాలని పిలుపు
విశాఖపట్నం, సెప్టెంబర్ 19: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన యువత ప్రజాసేవను, దేశాభివృద్ధికి తమ వంతు సహకారాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు సూచించారు. విశాఖపట్నంలోని పోర్ట్ స్టేడియం, కళావాణి ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన 20వ రోజ్‌గార్ మేళాలో 200 మంది కొత్తగా ఎంపికైన అభ్యర్థులకు ఆయన నియామక పత్రాలు అందజేశారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించడం గర్వించదగ్గ విషయమని, ఇలాంటి అవకాశాల కోసం లక్షలాది మంది యువత ఎదురుచూస్తుంటారని మంత్రి అన్నారు. ఈ స్థాయికి చేరుకోవడంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అందించిన సహకారం, చేసిన త్యాగాలను ఎప్పటికీ గుర్తుంచుకోవాలని సూచించారు.
ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా నేర్చుకోవడం ఆపకూడదని, కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటూ ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న లోపాలను గుర్తించి, ఉన్నతాధికారులతో కలిసి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల్లో ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకాన్ని మరింత బలోపేతం చేసేలా పనిచేయాలని, వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా తమను తాము సిద్ధం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎం. శ్రీభరత్, సీబీఐసీ చీఫ్ కమిషనర్ ఎన్. శ్రీధర్, ఆదాయపు పన్ను శాఖ చీఫ్ కమిషనర్ దండా శ్రీనివాస్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment