Wednesday, 16 September 2026

విలీనమా, విద్రోహమా, విమోచనమా?




సెప్టెంబర్‌ 17.. హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన  చారిత్రక రోజు. కానీ ఈ ఒక్క తేదీకి ఇప్పుడు అనేక పేర్లు.. అనేక రాజకీయ అర్థాలు. హిస్టారికల్‌ ఘటనను తమ తమ రాజకీయ సిద్ధాంతాలు, ప్రయోజనాలకు అనుగుణంగా వివిధ పార్టీలు వివిధ రకాలుగా నిర్వచిస్తున్నాయి. దీంతో సెప్టెంబర్‌ 17  గురించి చర్చ ప్రతి ఏడాది తెరపైకి వస్తోంది. 1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైంది. అయితే ఈ  పరిణామాన్ని బీజేపీ  ‘హైదరాబాద్‌ విమోచన దినోత్సవం' అంటున్నది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం’ పేరుతో వేడుకలు నిర్వహించింది. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం  సెప్టెంబర్‌ 17ను ‘ప్రజాపాలన దినోత్సవం’గా నిర్వహిస్తున్నది. ఎంఐఎం విద్రోహ దినం అంటున్నది.  పేర్లు మారుతున్న కొద్దీ రాజకీయ వాదనలు కూడా మారుతున్నాయి. అయితే చరిత్రను రాజకీయ అవసరాలకు అనుగుణంగా మార్చకుండా.. నాటి పరిణామాలను సమగ్రంగా చూడాల్సిన అవసరం ఉన్నది. హైదరాబాద్‌ సంస్థానంలో నిజాం పాలనకు, ఫ్యూడల్‌ వ్యవస్థ, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా సాగిన పోరాటానికి సుదీర్ఘ చరిత్ర ఉంది.  ఈ పోరాటంలో వామపక్షాలు  కీలక పాత్ర పోషించాయి. భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరీ, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. ఈ పోరాటంలో అనేక మంది ప్రాణత్యాగాలు చేశారు.

ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ సార్‌ మాటల్లో..
తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ ఈ అంశంపై తన స్వీయ అనుభవాన్ని అనేకసార్లు విశ్లేషించారు. దేని నుంచి విమోచనం? ఎవరి నుంచి తెలంగాణ విమోచనం? అన్నది ఆయన సంధించిన ప్రశ్న.  'నిజాం పాలన నుంచి విమోచనం అన్నాం. కరెక్టే. నిజాం పాలన విమోచనం కోసం ఆ ఉద్యమం నడిస్తే నిజాం పతనం తర్వాత పోరాటం ఆగిపోవాలి. నిజామును గద్దెదించడానికే పోరాటం జరిగితే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అదే నిజాంను ఈ రాష్ట్రానికి రాజ్ ప్రముఖ్ గా, గవర్నర్ గా నియమించకూడదు. నిజాం నుంచి విమోచనం అనుకుంటే నిజాంను మళ్లీ ఎట్లా గద్దెనెక్కించారనే ప్రశ్న ముందుకు వస్తుంది. కేవలం నిజాం పాలన నుంచే విముక్తి కోసం కా దు, నిజాం పాలనలో వేళ్లూనుకున్నటువంటి, కరుడుగట్టిన ఫ్యూడల్ వ్యవస్థ, ఆ వ్యవస్థలో జరిగిన దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి.. దోపిడీ నుంచి విముక్తి కోసం, ఫ్యూడల్ వ్యవస్థ నుంచి విముక్తి కోసం పోరాటం జరిగిందని చెప్పుకుంటాం. అలా చెప్పడానికి కారణం ఏమిటంటే ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం నిజాం పతనం తర్వాత కూడా మూడేండ్లు నడిచింది. 1948 సెప్టెంబర్ 17న నిజాం పదవీ భ్రష్టుడైన తర్వాత భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం 1951 అక్టోబర్ 19 వరకు నడిచింది. కనుక ఆనాటి పోరాటం కేవలం నిజాంకు వ్యతిరేకమే కాదు, నిజాం పాలనలో బాగా బల పడిపోయినటువంటి ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం నడిచింది. ఆ వ్యవస్థలో జరిగిన దోపిడీకి వ్యతిరేకంగా జరిగింది. కనుక అది ప్రధానంగా దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటం' అని ఆయన అభిప్రాయపడ్డారు.



బీజేపీ వాదనను తప్పుపడుతున్న వామపక్షాలు
సెప్టెంబర్‌ 17ను అధికారికంగా ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ గా నిర్వహించాలని బీజేపీ చాలాకాలంగా డిమాండ్‌ చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని ఆ పార్టీ ప్రకటిస్తూ వస్తోంది. బీజేపీ వాదన బైటికి ఎలా ఉన్నా అంతర్గతంగా మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం ఇది తప్ప మరొకటి కాదన్నది వామపక్షాల వాదన .  సాయుధ పోరాటం నడిపింది కమ్యూనిస్టులు. త్యాగాలు చేసింది వాళ్లే. ప్రాణాలు కోల్పోయింది కమ్యూనిస్టు కార్యకర్తలే. హైదరాబాద్ సంస్థానంపై పోలీస్ చర్య తర్వాత 1948లో జరిగిన మారణకాండపై నాటి కేంద్ర ప్రభుత్వం సుందర్ లాల్ కమిటీ వేసింది. ఆ నివేదిక ఇప్పటికీ గోప్యంగానే ఉన్నది. వాస్తవాలు ఇలా ఉంటే బీజేపీ తెలంగాణ అనగానే ముఖ్యంగా నిజాం ప్రభుత్వంపై జరిగిన 'ఆపరేషన్ పోలో ' అన్నది హిందూ, ముస్లింల మధ్య పోరాటంగా చిత్రించి దాని ద్వారా నాలుగు ఓట్లు, సీట్లు దక్కించుకోవచ్చనేది ఆపార్టీ ఆలోచన  అని వామపక్షాలు విమర్శిస్తున్నాయి. స్వతంత్ర ఉద్యమంలో, సాయుధ పోరాటంలో పాల్గొనని వారు విమోచన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని ఎద్దేవా చేస్తున్నాయి.




చరిత్ర ఎవరిది? నిర్ణయం ఎవరిది?

సంస్థానాల విలీనంలో నాటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆ బాధ్యతను నాటి హోం మంత్రి సర్దార్ వల్లబ్ బాయ్ పటేల్ తీసుకున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు. ఆయనకు బీజేపీకి ఏ సంబంధం లేదు. కానీ ఆయనను తమ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటారు. బీజేపీ చేసింది చెప్పుకోలేక ఇలా సున్నితమైన అంశాలను తెరమీదికి తెచ్చి గంగా జెమునా తెహజీబ్‌ లాంటి హైదరాబాద్‌లో ప్రజల మధ్య ఉన్న సహృద్భావ వాతావరణాన్ని చెడగొట్టవద్దన్నది ప్రజాస్వామికవాదుల అభిప్రాయం. సెప్టెంబర్‌ 17 కేవలం ఒక తేదీ కాదు. అది తెలంగాణ చరిత్రలో కీలక మలుపు. నిజాం పాలన అంతం, హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం, రైతాంగ సాయుధ పోరాటం, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేక ఉద్యమం, ఆపరేషన్‌ పోలో.. ఇలా అనేక చారిత్రక పరిణామాలు ఈ తేదీతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి సెప్టెంబర్‌ 17 విలీనమా? విమోచనమా? విద్రోహమా? అన్నది నాటి పోరాటంలో పాల్గొన్నవాళ్లు,  ప్రజలు తేల్చుకుంటారు.

No comments:

Post a Comment

Featured post

విలీనమా, విద్రోహమా, విమోచనమా?

సెప్టెంబర్‌ 17.. హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన  చారిత్రక రోజు. కానీ ఈ ఒక్క తేదీకి ఇప్పుడు అనేక పేర్లు.. అనేక రాజకీయ అర్థాలు. ...