- ఇక్కడి నుంచి వెళ్లాలని అనిపించడం లేదు: సునిధి చౌహాన్
శ్రీనగర్: కశ్మీర్ పర్యటనపై ప్రముఖ గాయని సునిధి చౌహాన్ ఆనందం వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచి కశ్మీర్‌ను సందర్శించాలన్నది తన కల అని, ఇన్నేళ్లుగా దేశంలోని ఎన్నో ప్రాంతాలను సందర్శించినా ఇక్కడికి వచ్చే అవకాశం మాత్రం రాలేదని ఆమె తెలిపారు. ఈసారి ఎట్టకేలకు కశ్మీర్‌లో అడుగుపెట్టానని, ఇక్కడి వాతావరణం తనకు స్వర్గంలా అనిపిస్తోందని చెప్పారు. కశ్మీర్ ప్రజలు ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారని సునిధి పేర్కొన్నారు. ఇక్కడి ఆహారం, ప్రశాంతమైన వాతావరణం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. ‘‘ఇక్కడి నుంచి తిరిగి వెళ్లాలని నాకు అసలు అనిపించడం లేదు. కశ్మీర్‌లో తప్పకుండా ఒక సంగీత కచేరీ నిర్వహించే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను. నేను కశ్మీర్‌ను ప్రేమిస్తున్నాను’’ అని ఆమె అన్నారు.
కశ్మీర్‌లో నిర్వహిస్తున్న సినీ కార్యక్రమాన్ని కూడా సునిధి చౌహాన్ ప్రశంసించారు. పెద్దగా ఆదరణ పొందని సినిమాలను కూడా ఎంతో కష్టపడి రూపొందించిన చిత్రబృందాలకు ఇలాంటి వేదికలు ఎంతో ప్రోత్సాహాన్నిస్తాయని చెప్పారు. ఆ చిత్రాలను వీక్షించేందుకు సినీప్రియులు తరలిరావడం మంచి పరిణామమని పేర్కొన్నారు. ‘‘ఇది ఎంతో మంచి కార్యక్రమం. ఎంతో కష్టపడి సినిమాలు తీసినా తగినంత ప్రశంసలు పొందని చిత్రాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. వాటిని చూసేందుకు సినిమా ప్రేమికులు వస్తున్నారు. ఇది మంచి ఆరంభమని నేను భావిస్తున్నాను’’ అని సునిధి చౌహాన్ అన్నారు.

No comments:
Post a Comment