- విద్యార్థుల వసతులపై నిర్మాణ ఆడిట్ తప్పనిసరి: సీజేపీ
న్యూఢిల్లీ: అక్రమ నిర్మాణాలు, విద్యార్థుల వసతుల భద్రతకు సంబంధించి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని సీజేపీ (CJP) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి ఏడు అంశాలతో కూడిన డిమాండ్లను సమర్పించినట్లు తెలిపారు. అక్రమ నిర్మాణాల వ్యవహారంపై స్వతంత్ర క్రిమినల్ దర్యాప్తు జరపాలని ఆయన కోరారు. కేవలం భవన యజమానులపై మాత్రమే కాకుండా.. అక్రమ నిర్మాణాలు, కార్యకలాపాలు సాగేందుకు రాజకీయ నాయకులు, అధికారుల అండదండలు ఉన్నాయా? అనే కోణంలోనూ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ‘‘ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు సహకరిస్తున్న యజమానులు, అధికారంలో ఉన్న వ్యక్తులు, రాజకీయ నాయకుల మధ్య ఉన్న విస్తృత సంబంధాలపై దర్యాప్తు జరగాలి. పెద్ద ఎత్తున కొనసాగుతున్న పీజీ మాఫియాపైనా విచారణ చేపట్టాలి’’ అని సౌరవ్ దాస్ పేర్కొన్నారు.
విద్యార్థులు ఉంటున్న భవనాలపై ప్రత్యేక ఆడిట్
ప్రభుత్వం అన్ని భవనాలకూ ఇంజినీరింగ్ ప్రమాణాలతో కూడిన నిర్మాణ భద్రతా ఆడిట్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా కళాశాలలు, పాఠశాలలు, విద్యార్థులు నివసించే పీజీలు, ఇతర వసతి గృహాలను ప్రత్యేకంగా పరిశీలించాలని కోరారు. ‘‘విద్యార్థులే ఈ దేశ భవిష్యత్తు. వారు నివసించే, చదువుకునే ప్రదేశాలు సురక్షితంగా ఉండేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని సౌరవ్ దాస్ అన్నారు. అక్రమ నిర్మాణాలకు, విద్యార్థుల భద్రతకు ముప్పు కలిగించే వసతులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టాలని సీజేపీ డిమాండ్ చేసింది.
No comments:
Post a Comment