Sunday, 30 August 2026

నేపాల్‌లో వరద బీభత్సం.. మృతులు 768

 



  • 2,500 మందికిపైగా గల్లంతు.. ఎనిమిది జిల్లాల్లో కొనసాగుతున్న గాలింపు
  • 8,186 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు
  • 108 మంది భారతీయులను రక్షించినట్లు విదేశాంగ శాఖ వెల్లడి

కాఠ్మాండు, ఆగస్టు 30: మధ్య నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. వరదల్లో మృతుల సంఖ్య 768కి చేరింది. మరో 2,500 మందికిపైగా గల్లంతయ్యారు. విపత్తు సంభవించి ఐదో రోజు కూడా సహాయక, గాలింపు చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ప్రభావిత ఎనిమిది జిల్లాల్లోనూ మృతదేహాలను వెలికితీస్తున్నారు.

నేపాల్‌ జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు, నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఆర్‌ఆర్‌ఎంఏ) ప్రకారం.. ఇప్పటివరకు ప్రభావిత ప్రాంతాల నుంచి 8,186 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిలో 227 మంది విదేశీయులు ఉన్నారు.

భోటే కోశి నదిలో వరద ఉద్ధృతి పెరగడంతో నేపాల్‌ ప్రభుత్వం తాజాగా వరద హెచ్చరిక జారీ చేసింది. నది పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రసువా, నువాకోట్‌, ధాదింగ్‌ జిల్లాల్లో భోటే కోశి సమీప ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని స్థానిక అధికారులు హెచ్చరించారు.

ఇదిలా ఉండగా నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న 108 మంది భారతీయులను ఇప్పటివరకు రక్షించినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ తెలిపారు. గతంలో ఆచూకీ లభించని సుమారు 50 మంది భారతీయులతో తిరిగి సంబంధాలు ఏర్పడ్డాయని వెల్లడించారు.

అయితే 275 మంది భారతీయులు ఇంకా గల్లంతైనట్లు సమాచారం ఉందని విదేశాంగ శాఖ తెలిపింది. ఇతర దేశాల పౌరసత్వం కలిగిన భారత సంతతికి చెందిన మరో 128 మంది కూడా ఆచూకీ లేకుండా ఉన్నారని పేర్కొంది. గత రెండు రోజుల్లో చైనా నుంచి 598 మంది భారతీయులు నేపాల్‌లోకి ప్రవేశించినట్లు స్థానిక ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చైనాలోనే ఉండి నేపాల్‌కు ఇంకా బయలుదేరని 900 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నారని, వారితో బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం నేరుగా లేదా స్థానిక ప్రభుత్వ సహకారంతో సంప్రదింపులు జరుపుతోందని విదేశాంగ శాఖ తెలిపింది.

వరద బాధితుల సహాయక చర్యలు, రక్షణ చర్యలను వేగవంతం చేసేందుకు భారత ప్రభుత్వం నేపాల్‌, చైనా అధికారులతో సమన్వయంతో పనిచేస్తోందని వెల్లడించింది.

No comments:

Post a Comment

Featured post

ఒడిశాకు రెడ్‌ అలర్ట్‌.. భారీ నుంచి అతి భారీ వర్షాలు

  నేడు ఒడిశాలో అత్యంత భారీ వర్షాలకు వాతావరణ శాఖ హెచ్చరిక పలు రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ వర్షాలు, ఉరుములు జమ్మూకశ్మీర్‌, పశ్చిమ మధ్యప్రద...