అమెరికాలోని ప్రముఖ బ్యాంకుల డిజిటల్ వ్యవస్థల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా, చేజ్, జేపీ మోర్గాన్, యూఎస్ బ్యాంక్, వెల్స్ ఫార్గోతోపాటు డిజిటల్ చెల్లింపుల నెట్‌వర్క్ జెల్లె సేవల్లోనూ అంతరాయాలు ఏర్పడినట్లు డౌన్‌డిటెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించడం, బ్యాంకు ఖాతాల్లోకి ప్రవేశించడంలో సమస్యలు ఎదురైనట్లు వినియోగదారులు తెలిపారు.
ఈ సమస్యపై చేజ్ బ్యాంక్ స్పందిస్తూ సాంకేతిక లోపం కారణంగానే అంతరాయం ఏర్పడిందని, దీనికి సైబర్ దాడితో సంబంధం లేదని స్పష్టం చేసింది. వినియోగదారుల లావాదేవీల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని, అయితే ఖాతాలు, నిధులకు యాక్సెస్ పూర్తిగా నిలిచిపోలేదని వెల్లడించింది. సమస్యను పరిష్కరించేందుకు తమ సాంకేతిక బృందాలు పనిచేస్తున్నాయని తెలిపింది. మరోవైపు పలువురు చేజ్ కస్టమర్లు ఎర్రర్ సందేశాలు వస్తున్నాయని, కొన్ని సేవలు అందుబాటులో లేవని ఫిర్యాదు చేశారు.
ఇటీవలి కాలంలో అమెరికాలో కీలక వ్యవస్థల్లో సాంకేతిక సమస్యలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్ సేవల్లో కొంతసేపు అంతరాయం ఏర్పడగా, ఆ తర్వాత విమానయాన రంగానికి చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) కీలక వ్యవస్థలు కూడా నిలిచిపోయాయి.
- యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌లోనూ సాంకేతిక సమస్య
అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌లో సోమవారం సాంకేతిక సమస్య తలెత్తడంతో కొద్దిసేపు విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. విమానం బయలుదేరే సమయంలో దాని తుది బరువు, సమతుల్యతకు సంబంధించిన సమాచారం (వెయిట్ అండ్ బ్యాలెన్స్ డేటా) పైలట్లకు అందకపోవడంతో సమస్య ఏర్పడింది. కొంతసేపటి తర్వాత లోపాన్ని సరిచేసినట్లు సంస్థ ప్రతినిధి వెల్లడించారు. ఇది సైబర్ దాడి కారణంగా సంభవించలేదని స్పష్టం చేశారు.
