- స్పష్టం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
- ట్రూత్ సోషల్ వేదికగా సంచలన ప్రకటన..
- ఇరాన్ నిధులు, జలసంధి తమ నియంత్రణలోనే ఉన్నాయన్న స్పష్టీకరణ
- డెమోక్రాట్లు పరిపాలించే రాష్ట్రాల్లో అవినీతిపై దృష్టి పెట్టాలని ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌కు ట్రంప్ ఆదేశం
వాషింగ్టన్: ఇరాన్‌తో ఎలాంటి దౌత్యపరమైన లేదా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు. ఆ రోజులు ఎప్పుడో గడిచిపోయాయని ఆయన స్పష్టం చేశారు. తన సోషల్ మీడియా వేదికైన 'ట్రూత్ సోషల్' (Truth Social) ద్వారా ట్రంప్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో ఎలాంటి ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం అమెరికాకు లేదని, ప్రస్తుతం ఇరాన్‌కు సంబంధించిన వందలాది బిలియన్ డాలర్ల నిధులతో పాటు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ (Strait of Hormuz) జలసంధి పూర్తిగా తమ అజమాయషీలోనే ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇరాన్ వ్యవహారంతో పాటు అమెరికాలోని డెమోక్రాటిక్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో విపరీతంగా పెరిగిపోయిన అవినీతి, నేరాలపై అమెరికా అధ్యక్షుడు తీవ్రంగా మండిపడ్డారు. మిన్నసోటా, కాలిఫోర్నియా, ఇల్లినాయిస్ వంటి రాష్ట్రాలు తీవ్రమైన దుర్వినియోగానికి, అవినీతికి గురవుతున్నాయని ఆయన ఆరోపించారు. డెమోక్రాట్ నాయకుల రక్తంలోనే అవినీతి ఉందని విమర్శించిన ట్రంప్.. ప్రతినెలా బిలియన్ల కొద్దీ డాలర్లు పక్కదారి పడుతున్నాయని, ఆ ఆర్థిక నేరాలపై దృష్టి పెట్టాలని ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ను కోరినట్లు వెల్లడించారు. దేశంలో జరుగుతున్న ఈ ఆర్థిక అవకతవకలను అరికడితే అమెరికా బడ్జెట్‌ను సులభంగా బ్యాలెన్స్ చేయవచ్చని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇరాన్‌తో చర్చలకు సంబంధించి ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ఒకవైపు దౌత్యపరమైన మార్గాలను అన్వేషిస్తున్నారన్న వార్తలొస్తున్న తరుణంలో.. ట్రంప్ స్వయంగా ఎలాంటి డీల్స్ ఉండవని తేల్చిచెప్పడం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

No comments:
Post a Comment