కేరళ: మినీ కూపర్ కారు ప్రమాదం కేసులో కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు, ఆగ్రహావేశాలు బెయిల్ మంజూరు చేయాలా వద్దా అన్న నిర్ణయాన్ని ప్రభావితం చేయకూడదని స్పష్టం చేసింది. చట్టపరమైన నిబంధనలు, న్యాయపరమైన అంశాల ఆధారంగానే న్యాయస్థానాలు నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొంది. ఈ కేసులో నలుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం, ప్రధాన నిందితుడి విడుదలపై మాత్రం ప్రత్యేక పరిమితులు విధించింది. అతడిని పది రోజుల తర్వాత బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించింది.
వివరాల్లోకి వెళ్తే.. అలప్పుళ సౌత్‌కు చెందిన 19 ఏళ్ల సజీవ్ గత నెలలో తన స్నేహితుడితో కలిసి మినీ కూపర్ కారులో నెడుంబస్సేరి సమీపంలోని విమానాశ్రయ రహదారిపై వేగంగా ప్రయాణించాడు. ఈ క్రమంలో కారు ఓ స్కూటర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువతులు, ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో నిందితులు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ప్రజాగ్రహానికి కారణమైంది. ఈ నేపథ్యంలో నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారణ సందర్భంగా హైకోర్టు స్పందిస్తూ.. ప్రజాభిప్రాయాల ఆధారంగా న్యాయస్థానాలు తీర్పులు ఇవ్వవని, చట్టం నిర్దేశించిన విధానాల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
