ఉక్రెయిన్-రష్యా కాల్పుల విరమణకు సంబంధించిన కార్యక్రమంలో అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ శాంతి, మానవత్వం ఆవశ్యకతను నొక్కిచెప్పారు. వైట్‌హౌస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ఒలెష్కీ ఈ రోజు వైట్‌హౌస్‌లో సమావేశమైన ధైర్యవంతులైన వ్యక్తులను ఎప్పటికీ ఒక్కటిగా నిలుపుతుంది. యుద్ధం కంటే మానవత్వానికే మేం ప్రాధాన్యమిచ్చాం. అమాయక ప్రజల ప్రాణాలు యుద్ధ విభజనలకంటే ఎంతో విలువైనవి. ఒలెష్కీ మరింత శాంతికి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను’’ అని అన్నారు.
ప్రతి గొప్ప మార్పు చిన్న నిప్పురవ్వతోనే ప్రారంభమవుతుందని, ఆ ఆరంభం ఎంత చిన్నదన్నది ముఖ్యం కాదని, దాన్ని గొప్ప మార్పుగా తీర్చిదిద్దాలన్న సంకల్పమే కీలకమని మెలానియా పేర్కొన్నారు. అమాయక ప్రజల బాధలను ఉమ్మడి ఆందోళనగా తీసుకుని, పరస్పర విభేదాలను పక్కనపెట్టి అందరూ ఒకే వేదికపైకి రావాలని పిలుపునిచ్చారు.
తాత్కాలిక కాల్పుల విరమణకే పరిమితం కాకుండా, మరింత శాశ్వతమైన శాంతిని నెలకొల్పేందుకు కలిసి కృషి చేయాలని ఆమె సూచించారు. చీకటితో నిండిన ప్రపంచంలో ఒలెష్కీ ఒక ఆశాకిరణంలా నిలవాలని, మానవత్వంలోని ఉత్తమ విలువలను వెలుగులోకి తీసుకురావాలని ఆకాంక్షించారు. శాంతి జ్వాలను మరింత బలంగా వెలిగించి, ఆశలను చిగురింపజేయడంతోపాటు పరస్పర సహకారాన్ని పెంపొందించి, శాశ్వత శాంతి దిశగా ప్రపంచానికి మార్గం చూపాలని మెలానియా ట్రంప్ పిలుపునిచ్చారు.

No comments:
Post a Comment