- రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
మాస్కో, అక్టోబర్ 2: ఉక్రెయిన్ సంక్షోభాన్ని శాంతియుత మార్గాల ద్వారా వీలైనంత త్వరగా ముగియాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిరంతరం కోరుతున్నారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించారు. ఇరు దేశాల మధ్య ఎంతో మంచి, స్నేహపూర్వక వ్యక్తిగత సంబంధాలు ఉన్నప్పటికీ.. ఉక్రెయిన్ వివాదానికి ముగింపు పలకాలని ప్రధాని మోడీ ఎప్పుడూ తన దృష్టికి తీసుకువస్తుంటారని పుతిన్ పేర్కొన్నారు. పరస్పర అంగీకారయోగ్యమైన పరిష్కారాలను కనుగొనేందుకు ప్రధాని మోడీ ఎంతో ఆసక్తి చూపుతున్నారని, ఆ దిశగా ఆయన వద్ద అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయని పుతిన్ కొనియాడారు. ఈ విషయంలో మోడీ తటస్థ వైఖరిని అవలంబిస్తూనే, వివాదానికి శాశ్వత ముగింపు పలకాలని బలంగా కోరుకుంటున్నారని తెలిపారు. ఈ సత్యాన్ని తాను బహిరంగంగా చెప్పడం తన బాధ్యతగా భావిస్తున్నానని పుతిన్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ సంక్షోభంపై ప్రధాని మోడీ వ్యక్తం చేస్తున్న ఆలోచనలకు, శాంతియుత పరిష్కారం కోసం ఆయన చూపుతున్న చొరవకు రష్యా కృతజ్ఞతలు తెలుపుతోందని పుతిన్ స్పష్టం చేశారు.