Thursday, 1 October 2026

‘ఇరాన్‌కు అణ్వాయుధం వస్తే అంతా ముగిసినట్లే’.. ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు




వాషింగ్టన్‌: ఇరాన్‌ అణ్వాయుధాన్ని తయారు చేయడానికి కేవలం మూడు, నాలుగు వారాల దూరంలో ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. ఇరాన్‌ అణ్వాయుధాన్ని సమకూర్చుకుంటే పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. ‘‘చరిత్రలోనే అత్యుత్తమ గణాంకాలను సాధించామని నేను చెప్పాను. అయితే ఇప్పుడు మనం కొంత మార్గం మళ్లించాల్సి వస్తోంది. ఎందుకంటే ఇరాన్‌ అణ్వాయుధాన్ని పొందే దశకు చేరుకుంది. వారు అణ్వాయుధాన్ని తయారు చేయడానికి మూడు నుంచి నాలుగు వారాల దూరంలో ఉన్నారు. బహుశా అంతకంటే ముందే సాధించవచ్చు. ఒకవేళ వారి చేతిలో అణ్వాయుధం ఉంటే.. మొత్తం ఆటే ముగిసినట్లే. వారికి అది లభించకుండా చూడాల్సిందే’’ అని ట్రంప్‌ అన్నారు.


  • మధ్యప్రాచ్యంలో మంటలను ఆర్పాలి


మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలను చల్లార్చాల్సిన అవసరం ఉందని ట్రంప్‌ పేర్కొన్నారు. ఇరాన్‌ అణ్వాయుధాన్ని కలిగి ఉంటే ఇజ్రాయెల్‌తో పాటు మొత్తం మధ్యప్రాచ్యంపై దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ‘‘మధ్యప్రాచ్యంలో మంటలను ఆర్పాలి. లేకపోతే వారు ఇజ్రాయెల్‌పై దాడి చేస్తారు. మొత్తం మధ్యప్రాచ్యాన్ని దెబ్బతీస్తారు. ఆ తర్వాత అమెరికాపైనా దాడులు ప్రారంభిస్తారు’’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.


  • బ్యారెల్‌ చమురు ధర 300–400 డాలర్లకు వెళ్తుందన్నారు


ఇరాన్‌ చర్యల కారణంగా అంతర్జాతీయ చమురు ధరలు భారీగా పెరుగుతాయని గతంలో అంచనాలు వెలువడ్డాయని ట్రంప్‌ గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం చమురు ధర బ్యారెల్‌కు 90 డాలర్ల వద్ద ఉందని తెలిపారు. ‘‘చమురు బ్యారెల్‌ ధర 300, 400 డాలర్లకు చేరుతుందని వారు చెప్పారు. కానీ ప్రస్తుతం అది 90 డాలర్ల వద్ద ఉంది’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.


  • హార్ముజ్‌ జలసంధిపై దిగ్బంధం.. ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు


ఇటీవలి రోజుల్లో హార్ముజ్‌ జలసంధి నుంచి మరింత చమురును బయటకు తీసుకువచ్చామని ట్రంప్‌ తెలిపారు. ఇరాన్‌ హార్ముజ్‌ జలసంధిపై దిగ్బంధం విధించిందని ఆయన ఆరోపించారు. ‘‘గత కొన్ని రోజులుగా హార్ముజ్‌ జలసంధి నుంచి మరింత చమురును బయటకు తీసుకొస్తున్నాం. వారు అక్కడ దిగ్బంధం విధించారు. ఆ మార్గం గుండా వెళ్లగలిగేది మేమే.. లేదా మేము అనుమతించిన వారు మాత్రమే’’ అని ట్రంప్‌ అన్నారు. ఇరాన్‌ నుంచి ఒక్క నౌక కూడా హార్ముజ్‌ జలసంధి గుండా వెళ్లలేదని ఆయన పేర్కొన్నారు. ‘‘ఇరాన్‌ నుంచి ఒక్క నౌక కూడా వెళ్లలేదు. నెలలుగా ఒక్క నౌక కూడా వెళ్లలేదు’’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.



No comments:

Post a Comment

Featured post

కరువు ప్రాంతాల సహాయం కోసం ఢిల్లీకి తెలంగాణ మంత్రుల బృందం: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, అక్టోబర్ 2: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల వల్ల కరువు బారిన పడిన ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కోరేందుకు ప్రత్యే...