Showing posts with label #RahulGandhi #ColumbiaUniversity #IndianEconomy #Unemployment #EducationCrisis #VoteChori #ElectionCommission #BJP #Congress #IndianPolitics. Show all posts
Showing posts with label #RahulGandhi #ColumbiaUniversity #IndianEconomy #Unemployment #EducationCrisis #VoteChori #ElectionCommission #BJP #Congress #IndianPolitics. Show all posts

Wednesday, 18 November 2026

ఆర్థిక విపత్తు అంచున భారత్‌.. విదేశీ వేదికపై రాహుల్‌ గాంధీ మరోసారి విమర్శలు



భారత్‌ ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. దేశంలో తీవ్ర నిరుద్యోగం, విద్యావ్యవస్థలో లోపాలు, యువతలో పెరుగుతున్న నిరాశ వంటి సమస్యలను ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వం ఈ అంశాలను అంగీకరించకపోయినా, మీడియా వీటిని పక్కన పెట్టినా భారత్‌ ఆర్థిక విపత్తు అంచున ఉందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు.


ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్‌ గాంధీ న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలోని లక్షలాది మంది మధ్యతరగతి యువత భవిష్యత్తుపై ఆందోళనతో ఉన్నారని, సరైన ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, విద్యావ్యవస్థలోని లోపాలు వారి నిరాశకు కారణమవుతున్నాయని అన్నారు. ఈ అసంతృప్తి క్రమంగా ప్రభుత్వంపై అసహనంగా మారుతోందని అభిప్రాయపడ్డారు.


“దేశంలోని సమస్యలపై మేము అధ్యయనం చేస్తున్నాం. కానీ అసలు సమస్య ఏమిటంటే.. భారత విద్యార్థులకు దేశంలో భవిష్యత్తు ఏమాత్రం కనిపించడం లేదు. సరైన ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో యువత తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. నిరుద్యోగం, పరిమిత ఉద్యోగ అవకాశాలు, విద్యావ్యవస్థలో లోపాలు విస్మరించడానికి వీలుకాని తీవ్రమైన సవాళ్లు. కెరీర్‌ అవకాశాల విషయంలో యువతకు, వారి తల్లిదండ్రులకు మధ్య అంతరం పెరుగుతోంది. మునుపటి తరం ఇచ్చే సలహాలను, వారి అనుభవాలను నేటి యువత ప్రశ్నిస్తోంది. ఉద్యోగాలు లేని తమ తల్లిదండ్రుల మాదిరిగా తామూ ఉండటానికి కొందరు ఇష్టపడటం లేదు” అని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.


ఎన్నికల సంఘం సాయంతోనే ఓటు చోరీ జరుగుతోందని ఆరోపణ


ఎన్నికల వ్యవస్థపైనా రాహుల్‌ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘం సహకారంతోనే అధికార బీజేపీ దేశంలో ఓటు చోరీకి పాల్పడుతోందని విమర్శించారు. 2024లో ఓటు వేసిన 14 కోట్ల మంది ప్రజలను ఓటర్ల జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలను ఎలా చెల్లుబాటు అయ్యేవిగా పరిగణించగలమని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్నామని, అయినప్పటికీ ఆ సంస్థ మౌనం వహిస్తోందని అన్నారు.


ఈ సమస్యను పూర్తిగా నిర్మూలించాలంటే ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని, అందుకోసమే తాము పోరాడుతున్నామని తెలిపారు. భారత ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని నిరూపించేందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, ప్రభుత్వంలోని కీలక అధికారులే ఈ సమాచారాన్ని అందించారని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వానికి భయపడి వారు బహిరంగంగా ముందుకు రావడం లేదని అన్నారు. భారత యువత మాత్రం సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు ఏకమై విద్యార్థి ఉద్యమాన్ని ముందుకు తీసుకొస్తోందని వ్యాఖ్యానించారు.


మరోవైపు రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విదేశీ గడ్డపై భారత్‌ను అవమానించడం ఆయనకు అలవాటుగా మారిందని విమర్శించింది.



Featured post

రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానాన్ని గొడ్డలితో ధ్వంసం చేసిన దుండగుడు.. ఐర్లాండ్‌లో సంచలనం!

ఐర్లాండ్‌లోని షానన్‌ విమానాశ్రయంలో పార్క్‌ చేసి ఉన్న అమెరికా సైనిక రవాణా విమానంపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. గొడ్డలి, ప్రత్యేక రసాయనాన్ని...