Showing posts with label #Ireland #ShannonAirport #USMilitaryAircraft #C130Hercules #AircraftDamage #AviationSecurity #Gallium #USA #MilitaryNews. Show all posts
Showing posts with label #Ireland #ShannonAirport #USMilitaryAircraft #C130Hercules #AircraftDamage #AviationSecurity #Gallium #USA #MilitaryNews. Show all posts

Wednesday, 18 November 2026

రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానాన్ని గొడ్డలితో ధ్వంసం చేసిన దుండగుడు.. ఐర్లాండ్‌లో సంచలనం!



ఐర్లాండ్‌లోని షానన్‌ విమానాశ్రయంలో పార్క్‌ చేసి ఉన్న అమెరికా సైనిక రవాణా విమానంపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. గొడ్డలి, ప్రత్యేక రసాయనాన్ని ఉపయోగించి విమానంలోని కీలక భాగాలను ధ్వంసం చేశాడు. నవంబర్‌ 11న జరిగిన ఈ ఘటనలో సుమారు 60 మిలియన్‌ డాలర్లు.. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.560 కోట్ల విలువైన సీ-130 హెర్క్యూలస్‌ విమానం తీవ్రంగా దెబ్బతిన్నట్లు అంచనా. ఈ దాడికి పాల్పడిన 48 ఏళ్ల డైథీ ఓకొర్రిన్‌ను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.


అధికారుల వివరాల ప్రకారం.. నిందితుడు డేవిడ్‌ కరన్‌ అనే తప్పుడు పేరుతో విమానాశ్రయ భద్రతా తనిఖీలను దాటుకుని, ట్యాక్సీవేపై పార్క్‌ చేసిన అమెరికా సీ-130 హెర్క్యూలస్‌ విమానం వద్దకు చేరుకున్నాడు. విమానం వెనుకవైపు తలుపు తాళాలను బద్దలుకొట్టి లోపలికి ప్రవేశించాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న గొడ్డలి, ఇతర వస్తువులతో విమానంలోని వైర్ల కట్టలు, హైడ్రాలిక్‌ లైన్లు, కాక్‌పిట్‌ గేజ్‌లు, ఎయిర్‌ డక్ట్‌లను ధ్వంసం చేశాడు.


అంతటితో ఆగకుండా విమానాల తయారీలో ఉపయోగించే అల్యూమినియాన్ని దెబ్బతీసే గాలియం ద్రవాన్ని కూడా వినియోగించాడు. ఆ తర్వాత విమానం పైకప్పులోని హాచ్‌ ద్వారా బయటకు వచ్చి దాని పైభాగాన్ని ధ్వంసం చేశాడు. ఇంధన ట్యాంకుల తాళాలను తొలగించి, వాటిలో బాల్‌ బేరింగ్స్‌ వేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనను గమనించిన భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. కొంతసేపు శ్రమించిన అనంతరం విమానం పైకప్పుపైనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.


పక్కా ప్రణాళికతోనే దాడి?


ఈ దాడి పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. విమానంలోని కంట్రోల్‌ వైర్లు, ఆక్సిజన్‌ మార్గాల గురించి నిందితుడికి పూర్తి అవగాహన ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఇంటర్నెట్‌లో వెతికి గాలియం క్యాప్సూల్స్‌ను ఆర్డర్‌ చేసి కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని సమాచారం. అల్యూమినియంపై గాలియం తీవ్ర ప్రభావం చూపుతుంది. సాధారణంగా విమానాల బాడీ నిర్మాణంలో అల్యూమినియాన్ని విస్తృతంగా ఉపయోగిస్తారు.


ఈ దాడి కారణంగా విమానం ఇక వినియోగానికి పనికిరాని స్థితికి చేరుకుందని నిపుణులు చెబుతున్నట్లు కథనం పేర్కొంది. అమెరికా సైనిక విమానంపై జరిగిన ఈ దాడి అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


Featured post

రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానాన్ని గొడ్డలితో ధ్వంసం చేసిన దుండగుడు.. ఐర్లాండ్‌లో సంచలనం!

ఐర్లాండ్‌లోని షానన్‌ విమానాశ్రయంలో పార్క్‌ చేసి ఉన్న అమెరికా సైనిక రవాణా విమానంపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. గొడ్డలి, ప్రత్యేక రసాయనాన్ని...