ఛత్తీ మయ్యా పాటకు లభించిన ఆదరణపై హర్షం
ముంబై: ప్రముఖ సినీనటి తమన్నా భాటియా ఛఠ్ మహాపర్వ్ సందర్భంగా ముంబైలోని జుహూ బీచ్‌లో నిర్వహించిన ఛత్ పూజ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్న భక్తులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. తన భక్తిగీతం ‘ఛత్తీ మయ్యా’కు లభించిన విశేష ఆదరణ పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ.. ఛత్ పూజను జరుపుకుంటున్న భక్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తుల విశ్వాసం, భక్తిశ్రద్ధలకు కృతజ్ఞతలు చెప్పేందుకే తాను ఇక్కడికి వచ్చానని తెలిపారు. ‘ఛత్తీ మయ్యా’ పాటకు ప్రేక్షకులు, భక్తుల నుంచి ఎంతో ప్రేమాభిమానాలు లభించాయని, ఆ పాటలో ఛత్ పూజను ప్రతిబింబించే అవకాశం తనకు దక్కడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.
గతంలో పాట ప్రచార కార్యక్రమాల కోసం పాట్నాకు వెళ్లినప్పుడు అక్కడ గంగా హారతిలో పాల్గొన్నానని గుర్తుచేసుకున్నారు. అప్పుడే పాట్నాలో ఛత్ పూజ వేడుకలను ప్రత్యక్షంగా చూడాలని కోరుకున్నానని వెల్లడించారు. అయితే, తన సొంత నగరమైన ముంబైలోనే ఇంతమంది భక్తులతో కలిసి ఈ పండుగను జరుపుకునే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ పండుగ విశిష్టత, దాని గురించి తన జీవితంలో తెలుసుకున్న విషయాలన్నీ ఎప్పటికీ తనతోనే ఉంటాయని తమన్నా పేర్కొన్నారు. ఛత్ పూజతో తనకు ఏర్పడిన అనుబంధం ఇకపై కూడా ఎప్పటికీ కొనసాగుతుందని ఆమె భావోద్వేగంగా వెల్లడించారు.

No comments:
Post a Comment