- ఆర్టెమిస్ మిషన్ కోసం కొత్త వ్యోమగాముల భర్తీకి నాసా శ్రీకారం
చంద్రుడిపై శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేసి, అక్కడ జీవించడానికి , పనిచేయడానికి ఇష్టపడే సాహసికులకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) సువర్ణావకాశం కల్పించింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన 'ఆర్టెమిస్' (Artemis) ప్రోగ్రామ్‌ను మరింత విస్తరించేందుకు గాను, రెండేళ్ల తర్వాత తొలిసారిగా కొత్త అంతరిక్ష యాత్రికుల (Astronauts) కొలువుల భర్తీ కోసం నాసా దరఖాస్తులను ఆహ్వానించింది. కెన్నెడీ స్పేస్ సెంటర్లో జరిగిన ఎయిర్ షో సందర్భంగా అంతరిక్ష పరిశోధన మరియు సాంకేతికతలో పురోగతిని ప్రకటిస్తూ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో రెండు సంవత్సరాల క్రితం నాసా కొత్త ఆస్ట్రోనాట్ల కోసం పిలుపునివ్వగా.. 8,000 మందికి పైగా దరఖాస్తు చేసుకోగా, సెప్టెంబర్ 2025 నాటికి కేవలం 10 మందే తుది ఎంపికలో నిలిచారు. ప్రస్తుతం నాసా వద్ద కేవలం 32 మంది మాత్రమే యాక్టివ్ ఆస్ట్రోనాట్లు ఉండటంతో, భూమి కక్ష్యను దాటి మానవ ఉనికిని విస్తరించేందుకు మరిన్ని నియామకాలు అత్యవసరమయ్యాయని ఆర్టెమిస్ III కమాండర్ రాండి బ్రెస్నిక్ తెలిపారు.
భవిష్యత్తులో చంద్రుడి ఉపరితలంపై ఆపరేషన్లు నిర్వహించడం, భూమి వెలుపల జీవించడం, మానవ అన్వేషణ సరిహద్దులను మరింత ముందుకు తీసుకెళ్లడంపై ఈ కొత్త తరకం వ్యోమగాతులకు కఠిన శిక్షణ ఇవ్వనున్నట్లు నాసా తన అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 3 లోపు తమ దరఖాస్తులను సమర్పించాలని నాసా స్పష్టం చేసింది. 2027 నాటికి తుది ఎంపికలు పూర్తి చేసి, 2028 ప్రారంభంలో శిక్షణను ప్రారంభించనున్నారు. సరిగ్గా ఇదే సంవత్సరంలో, అర్ధ శతాబ్దానికి పైగా విరామం తర్వాత నాసా వ్యోమగాతులు మళ్లీ చంద్రుడి ఉపరితలంపై కాలుమోపనున్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా అమెరికా పౌరసత్వం కలిగి ఉండటంతో పాటు కాలేజీ డిగ్రీ, ప్రొఫెషనల్ వర్క్ అనుభవం కలిగి ఉండాలి. రెండేళ్లపాటు సాగే ఈ కఠినమైన శిక్షణతో పాటు అంతరిక్షంలోకి వెళ్లేందుకు మరికొన్ని సంవత్సరాలు పట్టవచ్చని, చంద్రుడిపై అడుగుపెట్టడం అనుభవంలో కేవలం ఒక శాతం మాత్రమేనని, అసలు లక్ష్యం అంతరిక్ష మిషన్‌కు సహకరించడమేనని సుదీర్ఘకాలం అంతరిక్షంలో గడిపిన రికార్డు ఉన్న వ్యోమగాత్రి ఫ్రాంక్ రుబియో స్పష్టం చేశారు. 1959లో నాటి 'మర్క్యూరీ సెవెన్' నాటి నుంచి నాసా చేపడుతున్న 25వ వ్యోమగాముల బ్యాచ్ ఇదే కావడం గమనార్హం.

No comments:
Post a Comment