- ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) ఎంపీ సుప్రియా సూలే
న్యూఢిల్లీ: దేశంలో రాజ్యాంగ వ్యవస్థ తీవ్ర ముప్పును ఎదుర్కొంటోందని, బాబాసాహెబ్ అంబేడ్కర్ కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాసేలా ఒకే ప్రభుత్వం, ఒకే వ్యక్తి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) ఎంపీ సుప్రియా సూలే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ అణచివేతకు వ్యతిరేకంగా ఇండియా కూటమి పూర్తి బలంతో ఐక్యంగా నిలబడిందని, దిల్లీ నుంచి గ్రామీణ స్థాయి వరకు తమ పోరాటాన్ని ఉద్ధృతంగా కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు. దేశంలో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా జరుగుతున్న ప్రయత్నాలను చూస్తూ ఊరుకోబోమని, ప్రతి భారతీయుడి హక్కులను కాపాడుకునేందుకు ఇండియా కూటమి కట్టుబడి ఉందని సుప్రియా సూలే తేల్చిచెప్పారు. కొద్దిమంది చేతుల్లో అధికార కేంద్రీకరణ జరిగి, ప్రజల హక్కులను కాలరాసే యత్నం జరుగుతోందని, ఈ అన్యాయాన్ని ఎదిరించేందుకు అందరూ ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు.
