- యోగి ఆదిత్యనాథ్‌కు అఖిలేశ్ యాదవ్ సవాల్
- త్వరలో రామ మందిరానికి ఎస్పీ నేతలతో కలిసి వెళ్తా: ఎస్పీ అధినేత
న్యూఢిల్లీ, అక్టోబర్ 8: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు సవాల్ విసిరారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో యోగి అయోధ్య నుంచి పోటీ చేసి తన సత్తా నిరూపించుకోవాలని అన్నారు. ఎస్పీ నేత, మాజీ అయోధ్య ఎమ్మెల్యే తేజ్ నారాయణ్ పాండే (పవన్ పాండే) నిర్వహించిన శ్రీమద్ భాగవత కథ కార్యక్రమంలో అఖిలేశ్ మాట్లాడారు. అయోధ్య అసెంబ్లీ స్థానానికి ఎస్పీ అభ్యర్థిని ప్రకటించినప్పటి నుంచి బీజేపీ వరుసగా సర్వేలు నిర్వహిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రతి సర్వేలోనూ బీజేపీ వెనుకబడుతున్నట్లు తమకు సమాచారం వస్తోందని, అందుకే అయోధ్యకు కొత్త అభ్యర్థిని ఎంపిక చేయడంలో ఆ పార్టీ ఇబ్బంది పడుతోందని అఖిలేశ్ వ్యాఖ్యానించారు.
‘‘ముఖ్యమంత్రి పెద్ద పెద్ద హామీలు, ప్రకటనలు చేస్తుంటారు. అంత నమ్మకం ఉంటే.. ఆయనే అయోధ్య నుంచి ఎన్నికల్లో పోటీ చేసి తన బలాన్ని నిరూపించుకోవాలి’’ అని అఖిలేశ్ సవాల్ చేశారు.
త్వరలో రామ మందిరానికి..
అయోధ్య రామ మందిరాన్ని అఖిలేశ్ యాదవ్ ఇప్పటివరకు సందర్శించకపోవడంపై బీజేపీ చేస్తున్న విమర్శలకు కూడా ఆయన తాజాగా స్పందించారు. త్వరలోనే ఎస్పీ నేతలతో కలిసి రామ మందిరానికి వెళ్లి దర్శనం చేసుకుంటానని తెలిపారు. ఇటావాలోని కేదారేశ్వర్ ధామ్ ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత అయోధ్య రామ మందిరాన్ని సందర్శించాలని తాను గతంలోనే నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కేదారేశ్వర్ ధామ్ నిర్మాణం పూర్తయిన అనంతరం పవన్ పాండేను సంప్రదించి తేదీ ఖరారు చేసుకుని పార్టీ నేతలందరితో కలిసి రామ మందిరానికి దర్శనానికి వెళ్తానని అఖిలేశ్ పేర్కొన్నారు.
బీజేపీ విమర్శలకు సమాధానం
అఖిలేశ్ రామ మందిరాన్ని సందర్శించకపోవడాన్ని బీజేపీ తరచూ ప్రశ్నిస్తోంది. ఆలయ దర్శనానికి ఆహ్వానాలు ఉన్నప్పటికీ.. మైనారిటీ ఓటర్లను ఆకట్టుకునే రాజకీయ వ్యూహంలో భాగంగానే ఆయన ఆలయానికి వెళ్లడం లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో అఖిలేశ్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒకవైపు యోగి ఆదిత్యనాథ్‌ను అయోధ్య నుంచి పోటీ చేయాలని సవాల్ చేస్తూనే.. మరోవైపు తాను త్వరలో రామ మందిరాన్ని సందర్శించనున్నట్లు ప్రకటించడం ఉత్తరప్రదేశ్ ఎన్నికల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

No comments:
Post a Comment