Sunday, 18 January 2026

బీజేపీకి కొత్త బాస్


  • నేడే జాతీయ అధ్యక్ష ఎన్నికల నామినేషన్ల పర్వం
  • రేపు అధికారిక ప్రకటన
  • నితిన్ నబిన్ ఎన్నిక దాదాపు ఖాయం!

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తదుపరి జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ సోమవారం ఢిల్లీలో ప్రారంభంకానున్నది. పార్టీ జాతీయ రిటర్నింగ్ అధికారి, ఎంపీ కె. లక్ష్మణ్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, నేడు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. ఈ ప్రక్రియ అంతా న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించబడుతుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య నామినేషన్ల పరిశీలన చేపడతారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.



ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలైతే మంగళవారం (జనవరి 20న) పోలింగ్ నిర్వహిస్తారు. అయితే, ప్రస్తుతం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న నితిన్ నబిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఎక్కువగా ఉందని పార్టీవర్గాలు భావిస్తున్నాయి. రేపే నూతన అధ్యక్షుడి పేరును అధికారికంగా ప్రకటిస్తారు. బీజేపీ రాజ్యాంగం ప్రకారం, జాతీయ కౌన్సిల్, రాష్ట్ర కౌన్సిల్ ప్రతినిధులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.


ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న జేపీ నడ్డా బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన 2019లో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టి, 2020 జనవరిలో అమిత్ షా వారసుడిగా ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తాజాగా జరగబోయే ఈ ఎన్నిక ద్వారా బీజేపీ పగ్గాలు యువ నాయకత్వం చేతికి వెళ్లనుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

No comments:

Post a Comment

Featured post

దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి కన్నుమూత

  న్యూఢిల్లీ: దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో దూరదర్శన్‌ వార్తా ప్రసారాల్లో పరిచయమైన ...