Friday, 16 January 2026

నకిలీ విత్తనాలకు చెక్

Govt to Introduce Seed Act 2026 in Budget Session of Parliament
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ‘సీడ్ యాక్ట్ 2026’
విక్రేతలపై రూ.30 లక్షల భారీ జరిమానా, జైలు శిక్ష

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రైతులను వేధిస్తున్న నకిలీ, నాసిరకం విత్తనాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. రానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో (జనవరి 2026) అత్యంత కఠినమైన నిబంధనలతో కూడిన ‘విత్తన చట్టం 2026’ (Seed Act 2026) ను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఈ నూతన చట్టం ప్రధానంగా నకిలీ, అనధికారిక, నాణ్యత లేని విత్తనాల విక్రయాలను అరికట్టడమే లక్ష్యంగా పనిచేస్తుంది. పౌర సమాజం, వ్యవసాయ నిపుణుల సూచనల మేరకు రూపొందించిన ఈ బిల్లులో.. తప్పుడు విత్తనాలను విక్రయించే సంస్థలపై రూ. 30 లక్షల వరకు భారీ జరిమానాతో పాటు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా కఠిన నిబంధనలు చేర్చారు.



‘ఫుల్ ట్రేసబిలిటీ’
ఈ కొత్త చట్టం ద్వారా రైతులకు నాణ్యమైన, ధృవీకరించబడిన (Certified) విత్తనాలు మాత్రమే అందేలా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోనున్నది. ఇందులో భాగంగా ‘ఫుల్ ట్రేసబిలిటీ’ (Full Traceability) విధానాన్ని తీసుకురానున్నారు. అంటే, ఒక విత్తనం ఎక్కడ తయారైంది, ఎవరు సరఫరా చేశారు, దాని నాణ్యత ప్రమాణాలు ఏమిటి అనే పూర్తి సమాచారాన్ని రైతులు సులభంగా తెలుసుకోవచ్చు. దీని కోసం విత్తన ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్ (QR Code) వంటి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించనున్నారు. అలాగే మారుతున్న వాతావరణ పరిస్థితులకు తట్టుకునేలా, తక్కువనీటితో అధిక దిగుబడిని ఇచ్చే 'క్లైమేట్ రెసిలెంట్' (Climate-resilient) విత్తన రకాలను ప్రోత్సహించడం కూడా ఈ చట్టం ముఖ్య ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు.

అన్నదాతలకు మేలు జరుగుతుందని కేంద్రం ఆశాభావం
గత 60 ఏళ్లుగా అమల్లో ఉన్న పాత విత్తన చట్టాల స్థానంలో ఈ ఆధునిక చట్టాన్ని తీసుకురావడం వల్ల వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని ప్రభుత్వం భావిస్తున్నది. ముఖ్యంగా విత్తనాల ధరలను నియంత్రించడం, నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు త్వరితగతిన పరిహారం అందేలా చూడటం వంటి అంశాలపై ఈ చట్టం దృష్టి సారిస్తుంది. విత్తన ఉత్పత్తిదారులు, నర్సరీల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయడం ద్వారా మార్కెట్లో పారదర్శకత పెరుగుతుందని, తద్వారా అన్నదాతలకు మేలు జరుగుతుందని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేసింది.

No comments:

Post a Comment

Featured post

తొలి బిడ్డను ఆహ్వానించడానికి ముందే ఒక తేదీని అనుకున్నాం

  పాత ఇంటర్వ్యూలో సమంత చేసిన వ్యాఖ్యలు వైరల్ మా ఇంటి బంగారం" విజయంతో పాటు గర్భధారణ వార్తలతో హెడ్‌లైన్స్‌ లో నిలిచిన స్టార్ హీరోయిన్ దర్...