- అమెరికాకు అడ్డుతగిలితే వాణిజ్య ఆంక్షలే
- పాశ్చాత్య దేశాల తీరుపై రష్యా ఘాటు విమర్శలు
వాషింగ్టన్/కోపెన్‌హాగన్: గ్రీన్‌లాండ్ ను అమెరికా వశం చేసుకోవాలన్న తన ప్రణాళికకు అడ్డుపడే దేశాలపై భారీ వాణిజ్య సుంకాలు (టారిఫ్స్) విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన హెచ్చరిక జారీ చేశారు. వైట్‌హౌస్‌లో జరిగిన ఒక భేటీలో ఆయన మాట్లాడుతూ, ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా, చైనాల ప్రాబల్యం పెరుగుతున్న తరుణంలో, అమెరికా జాతీయ భద్రతకు గ్రీన్‌లాండ్ అత్యంత కీలకమని స్పష్టం చేశారు. అమెరికా సైనిక శక్తి దృష్ట్యా ఈ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడం అవసరమని, దీనిపై ఇప్పటికే నాటో (NATO) సభ్యదేశాలతో చర్చించామని ఆయన పేర్కొన్నారు. అయితే, తన పరిధిలోని ఈ స్వయంప్రతిపత్తి గల భూభాగాన్ని విక్రయించే ప్రసక్తే లేదని డెన్మార్క్ , గ్రీన్‌లాండ్ తెగేసి చెప్పాయి. డెన్మార్క్ నిర్ణయానికి మద్దతుగా పలు నాటో మిత్రదేశాలు ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేయడం ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్నది.
ఈ వివాదంపై రష్యా తీవ్రంగా స్పందిస్తూ పాశ్చాత్య దేశాల వైఖరిని ఎండగట్టింది. గ్రీన్‌లాండ్ ను దక్కించుకోవాలనే ఉద్దేశ్యం తమకు లేదని స్పష్టం చేసిన రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖారోవా, ఈ పరిణామాలను చూస్తుంటే పాశ్చాత్య దేశాలు గొప్పగా చెప్పుకునే 'నిబంధనల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థ' కుప్పకూలిపోతున్నదని ఎద్దేవా చేశారు. అమెరికాను గుడ్డిగా అనుసరించడం డెన్మార్క్ చేసిన పొరపాటని ఆమె విమర్శించారు. మరోవైపు, గ్రీన్‌లాండ్ లో తన సైనిక ఉనికిని పెంచుతామని డెన్మార్క్ ప్రకటించినప్పటికీ, వాషింగ్టన్‌లో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. అమెరికా ఉన్నతాధికారులు తమ పట్టు వీడకపోవడంతో ఈ అంతర్జాతీయ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తున్నది.
No comments:
Post a Comment