- బీజేపీలో నవ శకం
- దేశంలోనే అతిపెద్ద పార్టీకి 'యంగెస్ట్' ప్రెసిడెంట్
- నేడు అధికారికంగా బాధ్యతల స్వీకరణ!
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీలో ఒక కీలకమైన తరం మార్పునకు తెరలేస్తూ, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ యుగం ప్రారంభం కానుంది. కేవలం 45 ఏళ్ల వయసులోనే దేశంలోనే అత్యంత శక్తివంతమైన రాజకీయ పార్టీకి సారథ్యం వహించే బాధ్యతను నితిన్ నబిన్ చేపట్టబోతున్నారు. ప్రస్తుతం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఆయన, మంగళవారం అధికారికంగా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. పార్టీ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా ఆయన రికార్డు సృష్టించబోతుండటం గమనార్హం. జె.పి. నడ్డా వారసుడిగా పగ్గాలు చేపట్టనున్న నబిన్ నియామకంపై పార్టీ అధిష్టానం ఇప్పటికే పూర్తి స్థాయి కసరత్తు పూర్తి చేసింది. యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా దేశవ్యాప్తంగా పార్టీని మరింత చురుగ్గా ముందుకు తీసుకెళ్లాలనే ప్రధాని మోడీ, అమిత్ షాల వ్యూహం ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నది.
బిహార్‌కు చెందిన నితిన్ నబిన్ అట్టడుగుస్థాయి నుంచి ఎదిగిన నాయకుడిగా పార్టీలో మంచి గుర్తింపు పొందారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, గతంలో ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో పార్టీ విజయాల్లో కీలకపాత్ర పోషించి తన సంస్థాగత నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన నబిన్, అటు అనుభవజ్ఞులను, ఇటు యువతను సమన్వయం చేసుకుంటూ పార్టీని నడిపించగలరని అధిష్టానం నమ్ముతున్నది. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన ముందు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సవాల్ ఉంది. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో పార్టీని విస్తరించడంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించనున్నారు. నితిన్ నబిన్ రాకతో బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. పార్టీలో ఒక సామాన్య కార్యకర్త కూడా అత్యున్నత పదవిని అధిష్టించవచ్చనే సందేశాన్ని ఈ నియామకం ద్వారా బీజేపీ మరోసారి చాటిచెప్పినట్లయింది.
No comments:
Post a Comment