Sunday, 25 January 2026

కర్ణాటక అసెంబ్లీలో హైడ్రామా.. రాష్ట్రపతికి గవర్నర్ నివేదిక

  • సిద్ధరామయ్య సర్కార్ విమర్శలపై ఘాటు స్పందన

కర్ణాటక అసెంబ్లీలో ఇటీవల చోటుచేసుకున్న అసాధారణ పరిణామాలు ఇప్పుడు దేశ రాజధానికి చేరాయి. జనవరి 21, 22 తేదీల్లో అసెంబ్లీ ఉభయసభల సంయుక్త సమావేశంలో జరిగిన గందరగోళంపై గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమగ్ర నివేదికను సమర్పించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'వికసిత్‌ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్' (వీబీ - జీ రామ్‌ జీ) చట్టాన్ని విమర్శిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగ పాఠంలోని 2 నుంచి 11 వరకు ఉన్న పేరాలను తొలగించాలని తాను ఇచ్చిన సూచనలను ఈ నివేదికలో ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. రాజ్యాంగబద్ధమైన తన విధిని నిర్వహించే క్రమంలో తలెత్తిన అడ్డంకులను ఆయన రాష్ట్రపతికి వివరించారు.



శాసనసభలో తన ప్రసంగం ముగిసిన వెంటనే చోటుచేసుకున్న ఉద్రిక్తతలు, అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనపై ఒత్తిడి తెచ్చేందుకు నినాదాలు చేస్తూ ఘెరావ్ చేయడానికి ప్రయత్నించిన తీరును గవర్నర్ నివేదికలో విపులీకరించారు. ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్త.., గవర్నర్ నివేదిక ఇచ్చుకుంటే తమకేం అభ్యంతరం లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. గతేడాది యూపీఏ కాలం నాటి ఉపాధి హామీ పథకం స్థానంలో వచ్చిన కొత్త ఉపాధి పథకాన్ని విమర్శిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగం చదవడానికి గవర్నర్ నిరాకరించడంతో ఈ వివాదం ముదిరింది.


జనవరి 22న గవర్నర్ కేవలం ప్రసంగంలోని ప్రారంభ వాక్యాలను మాత్రమే చదివి, తన సొంత వ్యాఖ్యలను జోడించి సభ నుంచి బయటకు వెళ్లడం తీవ్ర చర్చకు దారితీసింది. ఆ సమయంలో కాంగ్రెస్ నాయకుడు బి.కె. హరిప్రసాద్ గవర్నర్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించడం, ఇతర ఎమ్మెల్యేలు ఆయన తీరును ఖండిస్తూ నినాదాలు చేయడం వంటి దృశ్యాలు అసెంబ్లీలో హైడ్రామాను తలపించాయి. 

No comments:

Post a Comment

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...