Sunday, 18 January 2026

అసోంలో మోడీ అభివృద్ధి విప్లవం


  • కాజీరంగా ఎలివేటెడ్ కారిడార్‌కు శంకుస్థాపన
  • రెండూ కొత్త 'అమృత్ భారత్' రైళ్లు ప్రారంభం
  • పర్యావరణం, ప్రగతి కలిసి నడవాలన్న ప్రధాని


కలియాబోర్ (అసోం): అసోం రాష్ట్ర అభివృద్ధిలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. నగావ్ జిల్లాలోని కలియాబోర్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం సుమారు 6,950 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న 'కాజీరంగా ఎలివేటెడ్ కారిడార్' ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 86 కిలోమీటర్ల పొడవైన ఈ జాతీయ రహదారి ప్రాజెక్టులో భాగంగా, కాజీరంగా నేషనల్ పార్క్ గుండా 35 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ వైల్డ్‌లైఫ్ కారిడార్‌ను నిర్మించనున్నారు. వన్యప్రాణుల స్వేచ్ఛా సంచారానికి ఆటంకం కలగకుండా, పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ ఈ రహదారిని రూపొందించడం విశేషం. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని, కాజీరంగా కేవలం నేషనల్ పార్క్ మాత్రమే కాదని, అది అసోం ఆత్మ అని కొనియాడారు. వన్యప్రాణుల రక్షణ అనేది అస్సాం భవిష్యత్తు , రాబోయే తరాల పట్ల మనకున్న బాధ్యత అని ఆయన ఉద్ఘాటించారు.



ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ రెండు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను (కామాఖ్య-రోహ్‌తక్ - డిబ్రూగఢ్-లక్నో) కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరుగుతూ, గత ప్రభుత్వాల హయాంలో అసోం అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. నేడు బీజేపీ ప్రభుత్వం అక్రమ చొరబాట్లను అరికడుతూ, అటవీ భూములను ఆక్రమణల నుంచి విముక్తి చేస్తూ అసోం అస్తిత్వాన్ని కాపాడుతున్నదని ప్రధాని గుర్తుచేశారు. అభివృద్ధి , ప్రకృతిని సమన్వయం చేస్తూ భారత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని, 'ఏక్ పేడ్ మా కే నామ్' ప్రచారంలో భాగంగా ఇప్పటికే 260 కోట్లకు పైగా మొక్కలు నాటడం దీనికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.


దేశవ్యాప్తంగా ప్రజలు సుపరిపాలన , అభివృద్ధిని కోరుకుంటున్నారని, అందుకే ఇటీవల జరిగిన బిహార్ ఎన్నికల్లో , మహారాష్ట్రలోని బీఎంసీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి రికార్డుస్థాయి మెజారిటీని అందించారని మోడీ గుర్తుచేశారు. ఈ కొత్త ఎలివేటెడ్ కారిడార్ వల్ల ఎగువ అసోంలోని డిబ్రూగఢ్, తిన్సుకియా వంటి ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతుందని, ప్రయాణ సమయం తగ్గడంతో పాటు రోడ్డు ప్రమాదాలు కూడా నివారించబడతాయని ఆయన వివరించారు. దేశ ప్రజల మొదటి ప్రాధాన్యంగా బీజేపీ నిలుస్తున్నదని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని ప్రధాని పునరుద్ఘాటించారు.

No comments:

Post a Comment

Featured post

అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు నేడే పోలింగ్

ముమ్మర ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల సంఘం దేశంలోని మూడు కీలక ప్రాంతాలైన అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు కొత్త ప్రజా ప్రతినిధులను ఎన్ను...