Saturday, 17 January 2026

నకిలీ ఓటర్లను ఏరిపారేయాల్సిందే

 






  • కేంద్రం పంపిన నిధులను టీఎంసీ లూటీ చేస్తున్నది
  • బెంగాల్ గడ్డపై మోడీ గర్జన

మాల్దా (పశ్చిమ బెంగాల్): పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరానికి ప్రధాని నరేంద్ర మోడీ శనివారం మాల్దా వేదికగా శంఖారావం పూరించారు. తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ.. మమతా బెనర్జీ సర్కార్‌ను అత్యంత 'కఠినమైన, అమానవీయమైన' ప్రభుత్వంగా ఆయన అభివర్ణించారు. బెంగాల్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు అక్రమ చొరబాట్లు  అని, అభివృద్ధి చెందిన దేశాలే తమ దగ్గర ఉన్న అక్రమ వలసదారులను బయటకు పంపిస్తుంటే, బెంగాల్‌లో మాత్రం అధికార పార్టీ వారిని ఓటు బ్యాంకుగా మార్చుకుంటోందని ధ్వజమెత్తారు. దేశ భద్రత దృష్ట్యా , బెంగాల్ అస్తిత్వాన్ని కాపాడేందుకు ఈ చొరబాటుదారులను ఏరివేయడం అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశారు.


ఇప్పుడు బెంగాల్ వంతు

రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్న వేల కోట్ల రూపాయలను టీఎంసీ నేతలు లూటీ చేస్తున్నారని మోడీ తీవ్రంగా ఆరోపించారు. "బెంగాల్‌లోని ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు రావాలని, ఉచిత రేషన్ అందాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఇక్కడ ఉన్న 'సిండికేట్ రాజ్' వల్ల ఆ నిధులు ప్రజలకు చేరకుండానే దారి మళ్లుతున్నాయి" అని ఆయన మండిపడ్డారు. మాల్దా, ముర్షిదాబాద్ వంటి జిల్లాల్లో అక్రమ చొరబాట్ల వల్ల జనాభా నిష్పత్తి మారుతున్నదని, దీనివల్ల అల్లర్లు కూడా సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత దశాబ్దాలుగా తూర్పు భారత దేశాన్ని విభజన రాజకీయాలతో బందీ చేసిన పార్టీల నుంచి ఒడిశా, బిహార్, అసోం విముక్తి పొందాయని, ఇప్పుడు బెంగాల్ వంతు వచ్చిందని ఆయన పిలుపునిచ్చారు.

మార్పు కావాలి, బీజేపీ ప్రభుత్వం రావాలి

మరోవైపు, మతపరమైన వేధింపుల వల్ల శరణార్థులుగా వచ్చిన మతువా వంటి సమాజాలకు తాను అండగా ఉంటానని, వారు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. పర్యటనలో భాగంగా దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలును మాల్దా నుంచి ప్రధాని ప్రారంభించారు. "మార్పు కావాలి, బీజేపీ ప్రభుత్వం రావాలి" అనే నినాదంతో బెంగాల్ ప్రజలు అసలైన మార్పు కోసం సిద్ధంగా ఉన్నారని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ఈ ర్యాలీతో బెంగాల్ రాజకీయాల్లో ఎన్నికల వేడి ఒక్కసారిగా పతాకస్థాయికి చేరింది.

No comments:

Post a Comment

Featured post

తొలి బిడ్డను ఆహ్వానించడానికి ముందే ఒక తేదీని అనుకున్నాం

  పాత ఇంటర్వ్యూలో సమంత చేసిన వ్యాఖ్యలు వైరల్ మా ఇంటి బంగారం" విజయంతో పాటు గర్భధారణ వార్తలతో హెడ్‌లైన్స్‌ లో నిలిచిన స్టార్ హీరోయిన్ దర్...