Tuesday, 27 January 2026

భారత్ - ఈయూ చరిత్రాత్మక వాణిజ్య సంరంభం


  • 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్' ఖరారు 
  • సరికొత్త శిఖరాలకు ద్వైపాక్షిక బంధం



భారతదేశం, యూరోపియన్ యూనియన్ (EU) మధ్య దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ మంగళవారం న్యూఢిల్లీలో చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ఖరారైంది. ప్రధాని నరేంద్ర మోడీ, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్‌ల మధ్య జరిగిన ప్రతినిధిస్థాయి చర్చల అనంతరం ఈ కీలక ప్రకటన వెలువడింది. ఈ ఒప్పందాన్ని ప్రధాని మోడీ , ఉర్సులా వాన్ డెర్ లేయన్ సంయుక్తంగా 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్' (అన్ని ఒప్పందాలకూ తల్లి వంటిది) అని అభివర్ణించారు. వాణిజ్యం, భద్రత, రక్షణ భాగస్వామ్యం, గ్రీన్ హైడ్రోజన్, విపత్తు నిర్వహణ వంటి కీలకరంగాల్లో మొత్తం ఏడు కీలక ఒప్పందాలను ఇరుపక్షాలు ఈ సందర్భంగా మార్చుకున్నాయి.


ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. భారత్ - ఈయూ సంబంధాలు ఈ జు కొత్త శిఖరాలను తాకాయని ఆనందం వ్యక్తం చేశారు. ఇది కేవలం వాణిజ్యానికి సంబంధించిన ఒప్పందం మాత్రమే కాదని, ఇరు దేశాల ఉమ్మడి శ్రేయస్సు కోసం రూపొందించిన సరికొత్త మార్గదర్శి అని ఆయన పేర్కొన్నారు. 27 దేశాలతో కూడిన యూరోపియన్ యూనియన్‌తో భారత్ కుదుర్చుకున్న అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇదేనని, దీనివల్ల అంతర్జాతీయస్థాయిలో పెట్టుబడులు పెరగడమే కాకుండా సరఫరా గొలుసులు (Supply Chains) మరింత బలోపేతం అవుతాయని ఆయన వివరించారు. ఈ ఒప్పందం ద్వారా రెండు బిలియన్ల జనాభా ఉన్న మార్కెట్ అనుసంధానం కావడం విశేషం.


యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా ఈ ఒప్పందాన్ని ఒక చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణిస్తూ, భారత్ - ఈయూ సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైందని తెలిపారు. గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరుకావడం తనకెంతో గౌరవంగా ఉందని ఉర్సులా వాన్ డెర్ లేయన్ పేర్కొన్నారు. భారతదేశం సాధిస్తున్న విజయాలు ప్రపంచ స్థిరత్వానికి, ఆర్థిక శ్రేయస్సుకు ఎంతో అవసరమని ఆమె కొనియాడారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ - ఈయూ మధ్య సుమారు 136 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరగగా, తాజా ఒప్పందంతో ఇది రాబోయే కొద్ది ఏళ్లలోనే రెట్టింపు అయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

No comments:

Post a Comment

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...