Wednesday, 28 January 2026

రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ ప్రభుత్వానికి గుర్తింపు

  • ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్‌’ ఎక్కిన భారత్ - ప్రధాని మోడీ ధీమా

న్యూఢిల్లీ: దేశం ఇప్పుడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను అధిగమించి, శాశ్వత పరిష్కారాల దిశగా దృఢంగా అడుగులు వేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో రోజున మీడియాను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, తమ ప్రభుత్వం 'రిఫార్మ్ (సంస్కరణ), పెర్ఫార్మ్ (పనితీరు), ట్రాన్స్‌ఫార్మ్ (పరివర్తన)' అనే సూత్రాలకు నిదర్శనంగా నిలిచిందని, దేశం నేడు 'రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్' ఎక్కి వేగంగా దూసుకుపోతున్నదని అభివర్ణించారు. సంక్షేమ పథకాలు సమాజంలోని చివరి వ్యక్తికి కూడా అందేలా తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, 2047 నాటికి 'వికసిత భారత్' లక్ష్యాన్ని చేరుకోవడానికి రాబోయే 25 ఏళ్లు అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. నిన్న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగం 140 కోట్ల మంది ప్రజల నమ్మకానికి ప్రతిరూపమని మోడీ పేర్కొన్నారు.



భారత్ - ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ఖరారు కావడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేస్తూ, ఇది ఆత్మవిశ్వాసం, ఉత్పాదకత కలిగిన నవ భారత నిర్మాణంలో ఒక మైలురాయి అని కొనియాడారు. ఈ ఒప్పందంతో అంతర్జాతీయంగా ఒక కొత్త మార్కెట్ అందుబాటులోకి వచ్చిందని, భారతీయ తయారీదారులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం భారత్ వైపు ఎంతో ఆశగా చూస్తున్నదని, మన ప్రజాస్వామ్యం, జనాభా శక్తి  ప్రపంచానికి కొత్త ఆశలను ఇస్తున్నాయని ప్రధాని తెలిపారు. నేడు భారత్ ప్రపంచ ఆకర్షణకు కేంద్రబిందువుగా మారిందని ఆయన గర్వంగా ప్రకటించారు.


పార్లమెంట్ సమావేశాల ప్రాధాన్యతను గుర్తు చేస్తూ, ఇది గందరగోళానికి సమయం కాదని, సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన సమయమని ప్రధాని ప్రజాప్రతినిధులకు సూచించారు. దేశాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్ వేదికగా, భారత దేశ సామర్థ్యాన్ని, ప్రజాస్వామ్యం పట్ల మనకున్న అంకితభావాన్ని ప్రపంచ సమాజానికి చాటిచెప్పే గొప్ప అవకాశం పార్లమెంటేరియన్లకు ఉందని ప్రధాని మోడీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

No comments:

Post a Comment

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...