- అబుదాబిలో చరిత్రాత్మక శాంతి చర్చలు
- రంగంలోకి దిగిన అమెరికా!
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య నాలుగేళ్లుగా సాగుతున్న భీకర యుద్ధానికి ముగింపు పలికే దిశగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా అడుగులు పడ్డాయి. అబుదాబిలో నిన్న రష్యా, ఉక్రెయిన్, అమెరికా ప్రతినిధుల మధ్య తొలి విడత త్రైపాక్షిక చర్చలు అత్యంత రహస్యంగా, కీలకంగా జరిగాయి. యుద్ధం మొదలైన తర్వాత ఈ మూడు దేశాలు ఒకే వేదికపైకి రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ చర్చలు నిర్మాణాత్మకంగా సాగాయని అమెరికా అధికారులు ధృవీకరించగా, నేడు కూడా ఈ భేటీ కొనసాగనుంది. యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ చర్చలకు స్వాగతం పలుకుతూ, సంక్షోభాలకు శాశ్వత పరిష్కారం కేవలం చర్చల ద్వారానే సాధ్యమని ఉద్ఘాటించారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్ స్కీ ఈ చర్చలపై స్పందిస్తూ.. తను ప్రారంభించిన యుద్ధాన్ని ముగించేందుకు పుతిన్ సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించారు. తొలిరోజు చర్చలు ముగిసిన అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆయన, ఇప్పుడే ఒక ముగింపునకు రావడం తొందరపాటే అవుతుందని, నేటి చర్చల ఫలితాలను బట్టి తదుపరి పరిణామాలు ఉంటాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్ తరపున జాతీయ భద్రతా చీఫ్ రుస్తెమ్ ఉమెరోవ్, చర్చల ప్రతినిధి డేవిడ్ అరఖమియా వంటి కీలక నేతలు ఈ భేటీలో పాల్గొంటున్నారు. రష్యా తరపున మిలిటరీ ఇంటెలిజెన్స్ అధిపతి జనరల్ ఇగోర్ కోస్ట్యుకోవ్ నేతృత్వంలోని బృందం చర్చల్లో పాల్గొంటోంది.
అయితే, ఈ శాంతి చర్చలకు భూభాగాల పంపకం ప్రధాన అడ్డంకిగా మారింది. ఉక్రెయిన్ ఆధీనంలో ఉన్న డొనెట్స్క్ ప్రాంతంలోని 25 శాతం భూభాగాన్ని తమకు అప్పగించాలని రష్యా పట్టుబడుతుండగా, ఉక్రెయిన్ అందుకు ససేమిరా అంటున్నది. ఈ చర్చలకు ముందే మాస్కోలో పుతిన్‌తో అమెరికా రాయబారులు స్టీవ్ విట్‌కాఫ్ మరియు జారెడ్ కుష్నర్ జరిపిన సుదీర్ఘ భేటీ సానుకూల ఫలితాలను ఇచ్చిందని రష్యా వర్గాలు తెలిపాయి. ఆర్థిక అంశాలపై చర్చించేందుకు రష్యా పెట్టుబడి రాయబారి కిరిల్ డిమిత్రీవ్, అమెరికా రాయబారి విట్‌కాఫ్‌తో విడిగా సమావేశం కానున్నారు. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చర్చలు ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పుతాయో లేదో వేచి చూడాలి.
No comments:
Post a Comment