Monday, 19 January 2026

వికసిత్ భారత్ ’జీ రామ్ జీ' చట్టంపై దుష్ప్రచారం వద్దు


  • కాంగ్రెస్‌పై శివరాజ్ సింగ్ చౌహాన్ ఫైర్
  • ఉపాధి హామీలో పనిదినాలు 125కు పెంపు
  • పేదల సంక్షేమమే మోడీ సర్కార్ లక్ష్యం!

న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 'వికసిత్ భారత్ ’జీ రామ్  జీ'' (Viksit Bharat G RAM G) చట్టంపై కాంగ్రెస్ దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని ఆయన ఆరోపించారు. సోమవారం ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో ఉపాధి హామీ పథకం (MGNREGA) కింద కాంగ్రెస్ ఇచ్చిన హక్కులు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ తన సిద్ధాంతాలను, ఆదర్శాలను విస్మరించిందని, ఆ పార్టీకి దేశాభివృద్ధి గురించి కానీ, పేదల సంక్షేమం గురించి కానీ ఎటువంటి పట్టింపు లేదని ఆయన విమర్శించారు. మోడీ ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు కట్టుబడి ఉందని, అందుకే గత పదేళ్లలో సుమారు 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని ఆయన గుర్తుచేశారు.



కొత్తగా తీసుకువచ్చిన ఈ చట్టం ద్వారా గ్రామీణ కుటుంబాలకు గతంలో ఉన్న 100 రోజుల ఉపాధిని ఇప్పుడు కనీసం 125 రోజులకు పెంచినట్లు మంత్రి స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకం కింద దేశవ్యాప్తంగా ఇప్పటివరకు పది కోట్ల ఆస్తులు సృష్టించబడగా, అందులో 8.5 కోట్ల ఆస్తులు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోనే నిర్మితమయ్యాయని ఆయన వెల్లడించారు. ఈ చట్టంలో ఎస్సీ, ఎస్టీలు, మహిళలు, దివ్యాంగులు, పేద వర్గాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని చౌహాన్ తెలిపారు. ఒకవేళ నిర్ణీత సమయంలోగా పని కల్పించలేకపోతే, నిరుద్యోగ భృతిని అందించే నిబంధనను కూడా ఈ కొత్త చట్టంలో చేర్చినట్లు ఆయన పేర్కొన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

No comments:

Post a Comment

Featured post

దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి కన్నుమూత

  న్యూఢిల్లీ: దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో దూరదర్శన్‌ వార్తా ప్రసారాల్లో పరిచయమైన ...