Saturday, 31 January 2026

నేడు సిట్ విచారణ

  • హైదరాబాద్‌కు చేరుకున్న మాజీ సీఎం
  • నందినగర్‌లో భారీ భద్రత

హైదరాబాద్: సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును సిట్ (SIT) అధికారులు నేడు విచారించనున్నారు. ఈ విచారణ నిమిత్తం కేసీఆర్ గజ్వేల్‌లోని తన ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుండి హైదరాబాద్‌లోని నందినగర్ నివాసానికి చేరుకున్నారు.

ఎర్రవల్లి నివాసం వద్ద ఉత్కంఠ
కేసీఆర్ హైదరాబాద్‌కు బయలుదేరే ముందు ఎర్రవల్లి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు, నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్‌కు తగిలిన దిష్టి పోవాలని, అపవాదుల నుంచి ఆయన బయటపడాలని ఆకాంక్షిస్తూ కార్యకర్తలు గుమ్మడికాయలతో దిష్టి తీశారు. అనంతరం భారీ కాన్వాయ్‌తో ఆయన నందినగర్ బయలుదేరారు.

నందినగర్‌లో కట్టుదిట్టమైన భద్రత 
మధ్యాహ్నం 3 గంటలకు సిట్ అధికారులు కేసీఆర్ నివాసంలోనే ఆయనను ప్రశ్నించనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని నందినగర్ పరిసర ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి, ఇతర వ్యక్తులు రాకుండా ఆంక్షలు విధించారు. కేసీఆర్ నివాసంలోకి కేవలం కుటుంబసభ్యులకు, విచారణ అధికారులకు మాత్రమే అనుమతి ఉంది. పార్టీ శ్రేణులు, అనుచరులు లోపలికి రాకుండా కఠిన నియమాలు అమలు చేస్తున్నారు.  విచారణకు ముందే మాజీ మంత్రి కేటీఆర్ నందినగర్ నివాసానికి చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కేసీఆర్‌ను అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేయబోతున్నారు, ఈ విచారణ ఎంతసేపు సాగుతుందనే అంశంపై ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.

No comments:

Post a Comment

Featured post

దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి కన్నుమూత

  న్యూఢిల్లీ: దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో దూరదర్శన్‌ వార్తా ప్రసారాల్లో పరిచయమైన ...