- ఉగ్రవాదంపై రాజీ వద్దు
- భారత్ పొరుగున ఉగ్ర మౌలిక వసతులకు ఊతమివ్వకండి
- దౌత్యపరమైన లక్ష్యంగా చేసుకోవడంపై విదేశాంగ మంత్రి ఆగ్రహం
న్యూఢిల్లీ: పొరుగు దేశం పాకిస్థాన్ కేంద్రంగా సాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అంతర్జాతీయ వేదికగా మరోసారి గళమెత్తారు. సోమవారం ఢిల్లీలో పర్యటిస్తున్న పోలాండ్ ఉప ప్రధాని, విదేశాంగమంత్రి రాడోస్లావ్ సికోర్స్కీతో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం విషయంలో పోలాండ్ 'జీరో టాలరెన్స్' (సహించేది లేదనే ధోరణి) ప్రదర్శించాలని, ముఖ్యంగా భారతదేశ పొరుగు ప్రాంతాల్లో ఉగ్రవాద మౌలిక సదుపాయాలు బలపడటానికి పోలాండ్ ఎట్టిపరిస్థితుల్లోనూ సహకరించకూడదని ఆయన స్పష్టం చేశారు. భారత్ ఎదుర్కొంటున్న సరిహద్దు ఉగ్రవాద సవాళ్ల గురించి పోలాండ్‌కు కొత్తగా చెప్పక్కర్లేదని, ఈ ముప్పును ఎదుర్కోవడంలో అంతర్జాతీయ సహకారం ఎంతో అవసరమని ఆయన గుర్తుచేశారు.
ఈ సమావేశంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, దాని ప్రభావాల గురించి కూడా చర్చ జరిగింది. గతంలో న్యూయార్క్, పారిస్ పర్యటనల సమయంలో ఉక్రెయిన్ సంక్షోభంపై భారత్ తన వైఖరిని స్పష్టం చేసిందని జైశంకర్ పేర్కొన్నారు. అయితే, కొన్ని దేశాలు భారత్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని (సెలెక్టివ్ టార్గెటింగ్) విమర్శలు చేయడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని, అది అన్యాయమని ఆయన మండిపడ్డారు. గ్లోబల్ పాలిటిక్స్‌లో భారత్ అనుసరిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ఆయన ఈ సందర్భంగా సమర్థించుకున్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రత విషయంలో ఇరు దేశాలు పరస్పర అవగాహనతో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.
ఆర్థిక సంబంధాల విషయానికి వస్తే, మధ్య ఐరోపాలో భారత్‌కు పోలాండ్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని జైశంకర్ కొనియాడారు. గత దశాబ్ద కాలంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు 200 శాతం వృద్ధి చెంది, ప్రస్తుతం 7 బిలియన్ డాలర్లకు చేరుకుందని ఆయన వెల్లడించారు. పోలాండ్‌లో భారతీయ పెట్టుబడులు 3 బిలియన్ డాలర్లు దాటాయని, దీనివల్ల అక్కడి ప్రజలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. భారతదేశపు బలమైన ఆర్థిక వృద్ధి, భారీ మార్కెట్ ,పెట్టుబడి అనుకూల విధానాలు పోలాండ్ వ్యాపారవేత్తలకు గొప్ప అవకాశాలను కల్పిస్తాయని, దీనిని అందిపుచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 2024లో ప్రధాని మోడీ పోలాండ్ పర్యటనతో ఇరు దేశాల బంధం 'వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి చేరిందని, దీనిని మరింత ముందుకు తీసుకెళ్తామని ఇరువురు నేతలు ప్రకటించారు.
No comments:
Post a Comment