- మంత్రంతోనే వికసిత భారత్ సాధ్యం
- 'మన్ కీ బాత్'లో ప్రధాని మోడీ పిలుపు
ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఆకాశవాణి ద్వారా నిర్వహించిన 130వ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భారత ఆర్థికవ్యవస్థ శరవేగంగా దూసుకుపోతున్నదని, ప్రపంచం మొత్తం మనవైపు ఆసక్తిగా చూస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ముఖ్యంగా స్టార్టప్‌లు, పరిశ్రమలకు చెందిన యువత ఉత్పత్తుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఏ వస్తువు తయారుచేసినా అందులో 'శ్రేష్ఠత' ప్రమాణంగా ఉండాలని, 'జీరో డిఫెక్ట్ - జీరో ఎఫెక్ట్' (లోపాలు లేని ఉత్పత్తి - పర్యావరణంపై ప్రభావంలేని తయారీ) అనే నినాదంతో ముందుకు సాగితేనే 'వికసిత భారత్' లక్ష్యాన్ని వేగంగా చేరుకోగలమని ఆయన స్పష్టం చేశారు.
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఓటరే ప్రజాస్వామ్యానికి ఆత్మ అని కొనియాడారు. ఎవరైనా యువకుడు మొదటిసారి ఓటరుగా నమోదైనప్పుడు, ఆ గ్రామం లేదా పట్టణం మొత్తం కలిసి ఆ యువకుడిని అభినందిస్తూ మిఠాయిలు పంచుకోవాలని, తద్వారా ఓటు హక్కు ప్రాముఖ్యంపై అవగాహన పెరుగుతుందని సూచించారు. సోమవారం దేశవ్యాప్తంగా జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల గురించి ప్రస్తావిస్తూ, రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఈ రోజున రాజ్యాంగ రూపకర్తలకు నివాళులర్పించే గొప్ప అవకాశం మనకు లభిస్తుందని అన్నారు.
మన దేశ సంప్రదాయంలో భజనలు, కీర్తనలు శతాబ్దాలుగా అంతర్భాగంగా ఉన్నాయని, నేటి యువత (Gen Z) కూడా భక్తిని తమ జీవనశైలిలో భాగంగా చేసుకుంటుండటం సంతోషకరమని మోడీ అన్నారు. దీనివల్ల 'భజన క్లబ్బింగ్' అనే కొత్త సాంస్కృతిక ధోరణి పుట్టుకొచ్చిందని ఆయన పేర్కొన్నారు. అలాగే మలేషియాలోని భారతీయ సమాజం మన సంస్కృతిని కాపాడటంలో చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. అక్కడ 500కు పైగా తమిళ పాఠశాలలు ఉన్నాయని, తమిళంతో పాటు తెలుగు, పంజాబీ వంటి భాషలపై కూడా అక్కడ విశేష దృష్టి సారిస్తున్నారని తెలిపారు. గత నెలలో మలేషియాలో నిర్వహించిన 'లాల్ పాడ్ చీర' వాక్ గురించి ప్రస్తావిస్తూ, బెంగాలీ సంస్కృతితో ఆ చీరకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. చివరగా, వచ్చే నెలలో జరగనున్న 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్' కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో భారత్ సాధిస్తున్న ప్రగతిని ప్రపంచానికి చాటిచెబుతుందని ప్రధాని అన్నారు.
No comments:
Post a Comment