- దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన 77వ గణతంత్ర వేడుకల సంబరాలు
భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవాన్ని సర్వ మత సామరస్యంతో, దేశభక్తి పరవళ్లతో ఘనంగా జరుపుకుంది. దేశ రాజధాని నుంచి మారుమూల గ్రామాల వరకు మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. రాష్ట్ర రాజధానుల్లో గవర్నర్లు, ముఖ్యమంత్రులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అసోం రాజధాని గువహటిలోని ఖానాపారాలో జరిగిన ప్రధాన కార్యక్రమంలో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయగా, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ డిబ్రూగఢ్‌లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. సిక్కిం రాష్ట్రంలో గ్యాంగ్‌టక్‌లోని పాల్జోర్ స్టేడియంలో జరిగిన సంబరాల్లో గవర్నర్ ఓం ప్రకాష్ మాథుర్ ముఖ్యఅతిథిగా హాజరుకాగా, ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని మహాత్మాగాంధీ మార్గ్‌లో గవర్నర్ హరిబాబు కంభంపాటి జాతీయ జెండాను ఆవిష్కరించి పరేడ్ వందనాన్ని స్వీకరించారు. కటక్‌లోని బారాబతి స్టేడియంలో ముఖ్యమంత్రి మోహన్ మాఝీ వేడుకల్లో పాల్గొని రాజ్యాంగ ప్రాముఖ్యాన్ని, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. కేరళ రాజధాని తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ జెండా ఎగురవేసి సాయుధ బలగాలు, పోలీసు, ఎన్‌సీసీ దళాల కవాతును పర్యవేక్షించారు. హరియాణా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ గురుగ్రామ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి బాబాసాహెబ్ అంబేద్కర్ సహా రాజ్యాంగ రూపకర్తలకు నివాళులర్పించారు. గుజరాత్‌లో ఈసారి రాష్ట్ర స్థాయి వేడుకలు కొత్తగా ఏర్పడిన వావ్-థరాద్ జిల్లాలోని మలుపూర్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగాయి, అక్కడ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ మువ్వన్నెల జెండాను ఎగురవేసి వందనం చేశారు. ఇలా దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ గణతంత్ర వేడుకలు స్ఫూర్తిదాయకమైన వాతావరణంలో ముగిశాయి.
No comments:
Post a Comment