- చిరు వ్యాపారులకు ఆర్థిక ఊతం
- కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో సామాన్యులకు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSME) లబ్ధి చేకూర్చే రెండు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. అసంఘటితరంగ కార్మికులకు వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ప్రారంభించిన అటల్ పెన్షన్ యోజన పథకాన్ని 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2015 మే నెలలో ప్రారంభమైన ఈ పథకం ద్వారా చందాదారులు చెల్లించే ప్రీమియాన్ని బట్టి 60 ఏళ్ల వయస్సు తర్వాత నెలకు వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు కనీస పెన్షన్ గ్యారెంటీగా లభిస్తుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దాదాపు ఎనిమిది కోట్ల 66 లక్షల మంది ఈ పథకంలో చేరి సామాజిక భద్రత పొందుతున్నారు.
మరోవైపు దేశంలోని చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు భారతీయ చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (SIDBI)లో ఐదు వేల కోట్ల రూపాయల మూలధనాన్ని ఇన్ఫ్యూజ్ చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల దాదాపు 25 లక్షల 74 వేల మంది కొత్త ఎంఎస్ఎంఈ లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనున్నది. ఈ నిధులను కేంద్ర ఆర్థిక సేవల విభాగం మూడు విడతల్లో సిడ్బీకి అందజేస్తుంది. మొదటి విడతగా మూడు వేల కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలోనే విడుదల చేయనుండగా, మిగిలిన నిధులను తదుపరి రెండు ఆర్థిక సంవత్సరాల్లో చెల్లిస్తారు. ఈ పెట్టుబడి వల్ల 2028 నాటికి ఆర్థిక సహాయం పొందే ఎంఎస్ఎంఈల సంఖ్య కోటికి చేరుకోవడమే కాకుండా, 2027-28 నాటికి కోటి 12 లక్షల మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తున్నది.
No comments:
Post a Comment