Wednesday, 21 January 2026

సునీతా విలియమ్స్ పదవీ విరమణ


  •  27 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు!

భారత సంతతికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) నుంచి పదవీ విరమణ పొందారు. నాసాలో సుమారు 27 ఏళ్ల పాటు అద్భుతమైన సేవలు అందించిన ఆమె, గత నెల 27వ తేదీనే రిటైర్ అయినట్లు నాసా అధికారికంగా ప్రకటించింది. అంతరిక్ష రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న సునీత, మొత్తం మూడు సార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) ప్రయాణించి 608 రోజుల పాటు అక్కడే గడిపారు. నాసా వ్యోమగాములలో అత్యధిక కాలం అంతరిక్షంలో ఉన్న వారిలో ఆమె రెండో స్థానంలో నిలవగా, 62 గంటలకు పైగా తొమ్మిది సార్లు స్పేస్‌వాక్ చేసి ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన మొదటి మహిళగా రికార్డు సృష్టించారు. అంతేకాకుండా అంతరిక్షంలో మారథాన్ నిర్వహించిన తొలి వ్యక్తిగా కూడా ఆమె చరిత్రకెక్కారు.



2006లో స్పేస్ షటిల్ డిస్కవరీ ద్వారా తన మొదటి ప్రయాణాన్ని ప్రారంభించిన సునీత, ఆ తర్వాత కాలంలో ఐఎస్ఎస్ కమాండర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఇటీవల 2024-25లో బోయింగ్ స్టార్‌లైనర్, స్పేస్ ఎక్స్ క్రూ -9 మిషన్లలో భాగంగా అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన ఆమె, ఎక్స్‌పెడిషన్ 72కు నేతృత్వం వహించారు. కేవలం అంతరిక్ష ప్రయాణాలే కాకుండా, భూమిపై ఉండి వ్యోమగాములకు శిక్షణ ఇవ్వడంలో. భవిష్యత్ చంద్ర మండల యాత్రల తయారీలో ఆమె కీలకపాత్ర పోషించారు. అమెరికా నౌకాదళంలో రిటైర్డ్ కెప్టెన్‌గా ఉన్న సునీతా విలియమ్స్, హెలికాప్టర్లు, విమానాల్లో 4,000 గంటలకు పైగా ప్రయాణించిన అనుభవం కలిగి ఉన్నారు. మానవ అంతరిక్ష యాత్రల చరిత్రలో ఆమె ఒక దిక్సూచి అని, భవిష్యత్ తరాలకు గొప్ప స్ఫూర్తి ప్రదాత అని నాసా ఈ సందర్భంగా ఆమెను కొనియాడింది.

No comments:

Post a Comment

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...