- ఐదేళ్లలో రెట్టింపు లక్ష్యం
- కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ధీమా
న్యూఢిల్లీ: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ భారత్ - యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం వల్ల రాబోయే ఐదేళ్లలో ఐరోపా దేశాలకు భారత్ చేసే ఎగుమతులు రెట్టింపు అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోని వ్యాపారవేత్తలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ), స్టార్టప్‌లు . పారిశ్రామికవేత్తలు అంతర్జాతీయ మార్కెట్లలో తమ ముద్ర వేయడంపై దృష్టి సారించాలని ఆయన కోరారు. ఈ చరిత్రాత్మక ఒప్పందం వల్ల దేశానికి చేకూరే వివిధ ప్రయోజనాలను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
ఈ వాణిజ్య ఒప్పందం భారతదేశానికి అపారమైన అవకాశాలను కల్పిస్తుందని, అదే సమయంలో దేశంలోని సున్నితమైన రంగాలకు పూర్తి రక్షణ కల్పిస్తుందని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ మార్గదర్శకత్వం, ఆయనపై ఉన్న నమ్మకం వల్లే ఈ ఒప్పందం వేగంగా ముగిసిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఉపాధి కల్పన ఎక్కువగా ఉండే కార్మిక ఆధారిత రంగాలకు ఈ ఒప్పందం ఒక గేమ్-ఛేంజర్‌గా మారుతుందని, ఇది దేశ ఆర్థికవృద్ధిని సరికొత్త స్థాయికి తీసుకెళ్తుందని ఆయన వివరించారు.
దేశ ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యం
మోడీ ప్రభుత్వం ఏ దేశంతో వాణిజ్య ఒప్పందం చేసుకున్నా దేశ ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యం ఇస్తుందని గోయల్ పునరుద్ఘాటించారు. యూరోపియన్ యూనియన్‌తో కుదిరిన ఈ ఒప్పందం కేవలం వస్తువుల క్రయవిక్రయాలకే పరిమితం కాకుండా, దేశంలో తయారీరంగాన్ని గణనీయంగా బలోపేతం చేస్తుందని ఆయన విశ్లేషించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మన ఉత్పత్తులను తీర్చిదిద్దడం ద్వారా ప్రపంచ మార్కెట్‌లో భారత్ అగ్రగామిగా ఎదుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment