- ఏఆర్ రెహమాన్‌కు కనిమొళి మద్దతు
బాలీవుడ్‌పై ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ తరుణంలో ఆయనకు డీఎంకే ఎంపీ కనిమొళి గట్టిడి మద్దతు పలికారు. హిందీ సినీ పరిశ్రమలో కొన్నేళ్లుగా అవకాశాలు తగ్గాయని, దీనికి మతపరమైన అంశాలు కూడా ఒక కారణం కావచ్చని రెహమాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, రచయిత్రి శోభా డే వంటి వారు తీవ్రస్థాయిలో మండిపడుతుండగా, కనిమొళి మాత్రం రెహమాన్ వెన్నంటి నిలిచారు. మతం, భాష, మూలాలకు అతీతంగా తన అద్భుత సంగీతంతో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ కీర్తిని చాటిన గొప్ప కళాకారుడు రెహమాన్ అని ఆమె కొనియాడారు.
రెహమాన్ కేవలం సంగీత దర్శకుడు మాత్రమే కాదని, భారతీయ సంస్కృతికి , ప్రజాస్వామ్య విలువలకు ఆయన ఒక అంతర్జాతీయ రాయబారి అని కనిమొళి అభివర్ణించారు. అటువంటి వ్యక్తిపై ద్వేషాన్ని చిమ్మడం, వివక్ష చూపడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆమె స్పష్టం చేశారు. ఒక కళాకారుడిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నప్పుడు బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారు మౌనంగా ఉండటం విచారకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య, బహుళత్వ సమాజంలో అసహనానికి చోటు ఉండకూడదని, రెహమాన్ వంటి ప్రతిభావంతులు గౌరవానికి అర్హులని ఆమె సోషల్ మీడియా వేదికగా తన గళాన్ని వినిపించారు.
No comments:
Post a Comment