ఛత్రూ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య హోరాహోరీ ఎదురుకాల్పులు
ముష్కరుల కోసం కొనసాగుతున్న గాలింపు!
కిష్త్వార్ (జమ్మూ కశ్మీర్): జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య భీకర ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని ఛత్రూ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా దళాలు సమీపిస్తుండగా, ముష్కరులు ఒక్కసారిగా తూటాల వర్షం కురిపించారు. జవాన్లు కూడా వెంటనే అప్రమత్తమై ధీటుగా బదులివ్వడంతో ఆ ప్రాంతం యుద్ధ భూమిని తలపిస్తున్నది. అటవీ ప్రాంతం కావడంతో ఉగ్రవాదులు తప్పించుకోకుండా భద్రతా దళాలు అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాయి.
ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించి సెర్చ్ ఆపరేషన్‌ను తీవ్రతరం చేశారు. ఇటీవల కాలంలో జమ్మూ ప్రాంతంలోని కొండ ప్రాంతాలలో ఉగ్రవాద కదలికలు పెరగడంతో భద్రతా దళాలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. కాల్పులు జరుగుతున్న ప్రాంతం నుంచి సామాన్య ప్రజలను దూరంగా పంపించి, రహదారులను దిగ్బంధించారు. ఘటనా స్థలంలో ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు నక్కి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. చీకటి పడేలోపు ఉగ్రవాదులను మట్టుబెట్టాలనే లక్ష్యంతో జవాన్లు ముందుకు సాగుతున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
No comments:
Post a Comment