- వచ్చే వారం సరికొత్త రక్షణ ఒప్పందంపై సంతకాలు
భారతదేశం, యూరోపియన్ యూనియన్ (EU) తమ వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. వచ్చే వారం న్యూఢిల్లీలో జరగనున్న భారత్ - ఈయూ శిఖరాగ్ర సదస్సులో ఇరుపక్షాలు సరికొత్త 'భద్రత , రక్షణ భాగస్వామ్యం'పై సంతకాలు చేయనున్నాయి. ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లో యూరోపియన్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈయూ విదేశాంగ విధాన విభాగం చీఫ్ కాజా కల్లాస్ ఈ కీలక ప్రకటన చేశారు. ఈ ఒప్పందం ద్వారా సముద్ర భద్రత, ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, సైబర్ రక్షణ, ఇండో - పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం వంటి అంశాల్లో సహకారం మరింత లోతుగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. అంతర్జాతీయ నియమాలతో కూడిన ప్రపంచ క్రమాన్ని రక్షించుకోవడానికి భారత్ వంటి దేశం ఐరోపాకు ఎంతో అవసరమని, ఆర్థిక పురోభివృద్ధిలో కూడా భారత్ కీలక భాగస్వామి అని ఆమె కొనియాడారు.
ఈ రక్షణ ఒప్పందంతో పాటు మేధోవలసలు, వృత్తి నిపుణుల రాకపోకలకు సంబంధించి 'మొబిలిటీ కోఆపరేషన్'పై కూడా ఇరు పక్షాలు ఒక అవగాహన ఒప్పందానికి రానున్నాయి. దీనివల్ల విద్యార్థులు, పరిశోధకులు, నైపుణ్యం కలిగిన నిపుణులు, కార్మికుల రాకపోకలు సులభతరం అవుతాయి. అలాగే చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉచిత వాణిజ్య ఒప్పందం (FTA) పై చర్చలను ముగించాలని, తద్వారా ఫార్మా, సెమీకండక్టర్లు, క్లీన్ టెక్నాలజీ రంగాల్లో సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయాలని ఈయూ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా అస్థిరత పెరుగుతున్న తరుణంలో, భారత్, ఐరోపా దేశాలు కలిసి పనిచేయడం వల్ల అంతర్జాతీయ సముద్రమార్గాల రక్షణ, ఆర్థిక భద్రతకు భరోసా లభిస్తుందని కల్లాస్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ ప్రతిష్టాత్మక భాగస్వామ్యంపై సంతకాలు చేసేందుకు యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ , యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా వచ్చే వారం భారత్ రానున్నారు. వీరు గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథులుగా హాజరుకావడం విశేషం. ఈ పర్యటనలో భాగంగా ఈ నెల 27న ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి వారు 16వ భారత్ - ఈయూ శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని, ఇరుదేశాల మధ్య సంబంధాల్లో ఇది ఒక చరిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుందని విదేశీ ప్రతినిధులు భావిస్తున్నారు.
No comments:
Post a Comment