Saturday, 17 January 2026

తెలంగాణలో ‘పోలీస్ రాజ్’ నడుస్తున్నది


  • విపక్షాల గొంతు నొక్కేలా కాంగ్రెస్ పాలన
  • రేవంత్ సర్కార్‌పై ధ్వజమెత్తిన బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్

హైదరాబాద్: తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నదని, రాష్ట్రంలో అప్రకటిత ‘పోలీస్ రాజ్’ను నడుపుతున్నదని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విపక్షాలకు ర్యాలీలు నిర్వహించుకునే కనీస ప్రజాస్వామ్యహక్కులను కూడా ప్రభుత్వం హరిస్తున్నదని ఆయన ఆరోపించారు. శాంతియుతంగా నిరసనలు తెలిపేందుకు అనుమతులు నిరాకరించడం ద్వారా ప్రభుత్వం ప్రజల గొంతు నొక్కాలని ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య తెలంగాణలో ఇలాంటి పరిణామాలు దురదృష్టకరమని, కాంగ్రెస్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నదని ఆయన విమర్శించారు.



ప్రజా సమస్యలపై పోరాడుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలను, నాయకులను అక్రమంగా అరెస్టులు చేయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు. "ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంద్రవెల్లి సభలో ప్రజాస్వామ్యం గురించి గొప్పలు చెబుతారు, కానీ రాజధానిలో మాత్రం ప్రతిపక్షాల ర్యాలీలకు అనుమతి ఇవ్వరు" అని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజా క్షేత్రంలో ఎదుర్కోలేక పోలీసు బలగాలతో పాలన సాగించడం కాంగ్రెస్ దివాళాకోరుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఎన్ని ఆంక్షలు విధించినా ప్రజల పక్షాన తమ పోరాటం ఆగదని, ప్రభుత్వ నిరంకుశ పోకడలపై న్యాయపోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

No comments:

Post a Comment

Featured post

దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి కన్నుమూత

  న్యూఢిల్లీ: దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో దూరదర్శన్‌ వార్తా ప్రసారాల్లో పరిచయమైన ...