Saturday, 31 January 2026

అగ్రరాజ్యంతో యుద్ధం మాకు ఇష్టం లేదు


  •  ఇరాన్ అధ్యక్షుడు సంచలన ప్రకటన

టెహ్రాన్: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల మధ్య ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ శాంతి మంత్రాన్ని పఠించారు. అమెరికాతో యుద్ధం చేయడం తమకు ఏమాత్రం ఇష్టం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈజిప్టు అధ్యక్షుడు అబ్డెల్ ఫత్తాహ్ ఎల్‌సిసితో ఫోన్‌లో మాట్లాడిన సందర్భంగా పెజెష్కియాన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ లేదా అమెరికా.. ఎవరికైనా సరే సంఘర్షణల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, శాంతితోనే సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.



పశ్చిమ దేశాలపై తీవ్ర విమర్శలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు , ఐరోపా దేశాల నాయకులు ఇరాన్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని పెజెష్కియాన్ మండిపడ్డారు. టెహ్రాన్‌లోని ఆర్థిక ఇబ్బందులను అడ్డం పెట్టుకుని ప్రజలను రెచ్చగొడుతున్నారని, దేశాన్ని ముక్కలు చేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. స్థానిక మీడియాలో విడుదలైన వీడియోలో ఆయన మాట్లాడుతూ, ఇరాన్‌లో జరుగుతున్న ఆందోళనలు కేవలం సామాజిక నిరసనలు కావని, అవి విదేశీ ప్రేరేపితమైనవని ధ్వజమెత్తారు.


చర్చలపై ట్రంప్ స్పందన

ఇదిలా ఉండగా, ఇరాన్ తమతో చర్చలకు సిద్ధమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు. ఇరు దేశాల మధ్య ఒప్పందం జరుగుతుందో లేదో వేచి చూడాలని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, శాంతి గురించి మాట్లాడుతూనే ట్రంప్ పరోక్ష హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇప్పటికే అమెరికా యుద్ధనౌకలు ఇరాన్ దిశగా కదులుతున్నాయని గుర్తు చేస్తూ, భద్రతా కారణాల దృష్ట్యా తమ తదుపరి కార్యాచరణను ఇప్పుడే వెల్లడించలేమని స్పష్టం చేశారు. ఈ పరిణామాలు గమనిస్తుంటే, ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు మొదలైనప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం యుద్ధ వాతావరణం ఇంకా చల్లారలేదని సమాచారం.

No comments:

Post a Comment

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...