- ఖర్గే, రాహుల్‌తో శశి థరూర్ కీలక భేటీ
- విభేదాల ఊహాగానాలకు తెర
న్యూఢిల్లీ: కొంతకాలంగా కాంగ్రెస్ అధిష్ఠానానికి, సీనియర్ నేత శశి థరూర్‌కు మధ్య విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. గురువారం నాడు తిరువనంతపురం ఎంపీ శశి థరూర్.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మరియు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. సుమారు 30 నిమిషాల పాటు సాగిన ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ముఖ్యంగా ప్రధాని మోడీని ప్రశంసించారనే కారణంతో థరూర్‌పై పార్టీ గుర్రుగా ఉందని, ఆయన త్వరలోనే బీజేపీలోకి వెళ్తారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇటీవల కొచ్చిలో జరిగిన పార్టీ సమావేశంలో రాహుల్ గాంధీ 12 మంది సీనియర్ నేతల పేర్లను ప్రస్తావించినా, వేదికపైనే ఉన్న థరూర్ పేరును విస్మరించడం చర్చనీయాంశమైంది. ఈ ‘అవమానం’ వల్లే ఆయన గత వారం జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల వ్యూహరచన సమావేశానికి హాజరుకాలేదని ప్రచారం జరిగింది. అయితే, తాజాగా జరిగిన ఈ ముఖాముఖి భేటీతో ఆ విభేదాలన్నీ సమసిపోయినట్లేనని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కేరళ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, థరూర్ వంటి ప్రజాకర్షణ కలిగిన నేతను దూరం చేసుకోకూడదని అధిష్ఠానం భావిస్తున్నది. ఈ సమావేశంలో పార్టీ ఐక్యత, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తున్నది.
No comments:
Post a Comment