- మీ అనుభవాలను పంచుకోవాలంటూ రాహుల్ గాంధీ పిలుపు
దేశాన్ని పట్టిపీడిస్తున్న వాయు కాలుష్య సంక్షోభంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్యం అనేది కేవలం శీతాకాలంలో మాత్రమే చర్చించుకునే అంశం కాదని, ఇది ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న అత్యవసర సమస్య అని ఆయన పేర్కొన్నారు. వచ్చే శీతాకాలం వరకు వేచి చూడకుండా, ఇప్పుడే ఈ కాలుష్య కోరల నుంచి బయటపడటానికి సమగ్ర చర్యలు చేపట్టాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. ఈ సంక్షోభం వల్ల సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, వారి ఆరోగ్య సమస్యలను స్వయంగా తెలుసుకోవాలని రాహుల్ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే, కాలుష్యం మీ జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నదో తెలియజేసే కథనాలను లేదా అనుభవాలను తనతో పంచుకోవాలని ఆయన పౌరులను కోరారు.
వాయు కాలుష్యం వల్ల చిన్నారులు, వృద్ధులు శ్వాసకోశ వ్యాధులతో అల్లాడుతున్నారని, ఇది ఒక తరం ఆరోగ్యాన్నే దెబ్బతీస్తున్నదని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలకతీతంగా అందరూ కలిసికట్టుగా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని వెతకాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో కాలుష్య నియంత్రణకు అవసరమైన మౌలిక మార్పులు తీసుకురావాలని ప్రభుత్వాలను కోరారు. ప్రజల నుంచి వచ్చే స్పందనలు , సూచనల ఆధారంగా ఈ సమస్యపై మరింత లోతైన చర్చను జాతీయస్థాయిలో జరపాలని ఆయన భావిస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతంలోని అనేక నగరాలు విషపూరిత గాలితో నిండిపోవడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్వచ్ఛమైన గాలిని పీల్చడం అనేది ప్రతి భారతీయుడి ప్రాథమిక హక్కు అని, దానిని కాపాడటంలో విఫలమవ్వడం అంటే ప్రజల భవిష్యత్తును ప్రమాదంలో నెట్టడమేనని రాహుల్ స్పష్టం చేశారు. ఈ ప్రజా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, కాలుష్య రహిత భారత్ కోసం తమ గళాన్ని వినిపించాలని ఆయన సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు.
No comments:
Post a Comment