Monday, 19 January 2026

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ బాధ్యతల స్వీకరణ


  • ఢిల్లీలో అట్టహాసంగా బాధ్యతలు చేపట్టిన యంగ్ లీడర్
  • నడ్డా నుంచి పగ్గాలు అందుకున్న  నేత!

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ మంగళవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. దేశ రాజధానిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో దిగిపోతున్న అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులు పలువురు సీనియర్ నేతల సమక్షంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. 45 ఏళ్ల వయసులోనే పార్టీ అత్యున్నత పదవిని అధిష్టించిన నబిన్, బీజేపీ చరిత్రలోనే అతి పిన్న వయస్కుడైన జాతీయ అధ్యక్షుడిగా రికార్డు సృష్టించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచిన ప్రధాని నరేంద్ర మోడీకి, పార్టీ అగ్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఒక సామాన్య కార్యకర్తస్థాయి నుంచి ఈరోజు దేశంలోనే అతిపెద్ద పార్టీకి అధ్యక్షుడిగా ఎదగడం కేవలం బీజేపీలోనే సాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు.



బాధ్యతలు చేపట్టిన వెంటనే నితిన్ నబిన్ తన పనిని ప్రారంభించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించడమే తన ముందున్న ప్రథమ ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ, ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. యువతకు, కొత్త రక్తాన్ని పార్టీలోకి ఆహ్వానించడంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషిస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జేపీ నడ్డా హయాంలో పార్టీ సాధించిన విజయాలను కొనసాగిస్తూనే, సరికొత్త ఉత్సాహంతో పార్టీని నవశకం వైపు నడిపించేందుకు నబిన్ సిద్ధమయ్యారు. ఆయన రాకతో కమల దళంలో కొత్త జోష్ నెలకొంది.










No comments:

Post a Comment

Featured post

దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి కన్నుమూత

  న్యూఢిల్లీ: దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో దూరదర్శన్‌ వార్తా ప్రసారాల్లో పరిచయమైన ...