Saturday, 31 January 2026

ఐరాస వేదికపై భారత్ గళం


  • సామాజిక అభివృద్ధి సదస్సులో భారత ప్రతినిధి బృందానికి సావిత్రి ఠాకూర్ నాయకత్వం


న్యూఢిల్లీ: న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరగనున్న సామాజిక అభివృద్ధి కమిషన్ 64వ సెషన్‌కు భారత ప్రతినిధి బృంద నాయకురాలిగా కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ వ్యవహరించనున్నారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ వార్షిక సదస్సులో సామాజిక చేరిక, సమానత్వం, సంక్షేమ ఆధారిత విధానాలపై అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా చర్చలు సాగనున్నాయి. ప్రపంచ దేశాలన్నీ తమ ప్రగతిని సమీక్షించుకోవడానికి, అనుభవాలను పంచుకోవడానికి , ఉత్తమ పద్ధతులను ఇచ్చిపుచ్చుకోవడానికి ఈ సదస్సు ఒక ప్రపంచ వేదికగా నిలవనుంది.



ఈ ప్రతిష్టాత్మక సదస్సులో భారత్ పాల్గొనడం అనేది సామాజికాభివృద్ధికి సంబంధించిన బహుళపక్ష ప్రయత్నాలలో దేశం చూపుతున్న నిరంతర చురుకుదనాన్ని ప్రతిబింబిస్తుందని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ తెలిపింది. ప్రపంచ సామాజిక విధాన ప్రాధాన్యాలపై నిర్మాణాత్మక చర్చలు జరపడానికి భారత్ కట్టుబడి ఉందని ఈ పర్యటన చాటిచెబుతున్నది. ఈ పర్యటన సందర్భంగా మంత్రి సావిత్రి ఠాకూర్ ఐరాసకు చెందిన వివిధ విభాగాల ప్రతినిధులతో , ఇతర సభ్య దేశాల ప్రతినిధులతో సమావేశమై సామాజికాభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చలు జరపనున్నారు. ఇది అంతర్జాతీయస్థాయిలో భారతదేశపు సామాజిక సంక్షేమ పథకాలు, విధానాలను వివరించడానికి ఒక గొప్ప అవకాశంగా నిలవనుంది.

No comments:

Post a Comment

Featured post

దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి కన్నుమూత

  న్యూఢిల్లీ: దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో దూరదర్శన్‌ వార్తా ప్రసారాల్లో పరిచయమైన ...